బద్వేలు అర్బన్ : ఒకరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. మరొకరు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఇంకొకరేమో బీటెక్ చివరి దశలో మానేశారు. ఉద్యోగ, ఉపాధి మార్గాలు ఎంచుకుని ఉన్నతంగా ఎదగాల్సిన వీరు.. దురలవాట్లకు బానిసలుగా మారి పక్కదారి పట్టారు. చేసిన అప్పులు తీర్చేందుకు, జల్సాల కోసం చోరీల బాట పట్టారు. చివరకు ఇద్దరు పోలీసులకు చిక్కి కటకటాల పాలు కాగా, మరొకరేమో పరారీలో ఉన్నాడు. గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ నుంచి నకిలీ పత్రాలతో ప్లేవుడ్ బోర్డులు కాజేసేందుకు యత్నించగా రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎం.నాగభూషణ్ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్లేవుడ్ బోర్డులను ఎగుమతి చేస్తుంటారు. ఇందుకోసం వివిధ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వారి ద్వారా వాహనాలను సమకూర్చుకుంటారు. ఈ క్రమంలో కలకత్తాకు చెందిన సరస్వతి ప్లేబోర్డ్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సెంచురీ పానెల్స్ పరిశ్రమకు రూ.5 లక్షల విలువ చేసే 885 ప్లేవుడ్ బోర్డుల ఆర్డర్ వచ్చింది. ఇందుకు సెంచురీ పరిశ్రమ యాజమాన్యం వాహనం కోసం తమ వెబ్‌సైట్‌లో పొందుపరచగా... విజయవాడకు చెందిన ఫైన్ లాజిస్టిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ వాహనం సమకూర్చే హక్కును దక్కించుకుంది. అయితే అప్పటికే సంబంధిత ట్రాన్స్‌పోర్ట్ కంపెనీతో సంబంధాలున్న నెల్లూరు జిల్లా సీతారామపురం గ్రామం పడమటివీధికి చెందిన ఆకులమహేష్ ముందస్తు ప్రణాళికలో భాగంగా కంపెనీ తరఫున తన స్నేహితుడైన పూంగవనంశివకుమార్ ద్వారా నకిలీ ఆర్‌సీ, ఎఫ్‌సీ, పర్మిట్ సృష్టించి మరొక స్నేహితుడైన మనీష్ ద్వారా వేరొక వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి గత నెల 20వ తేదీన సరుకును తీసుకెళ్లాడు. అయితే సరుకును కలకత్తాకు తీసుకెళ్లకుండా నెల్లూరులోని ఓ గదిలో భద్రపరిచి.. కొద్ది రోజుల తర్వాత అమ్ముకోవాలని ప్లాన్ చేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. కంపెనీ నుంచి సరుకు బయటికి వెళ్లినప్పటి నుంచి అన్‌లోడ్ చేసే వరకు వాహనాన్ని జీపీఎస్ ట్రాకింగ్ చేస్తారు. అయితే ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ట్రాకింగ్ లభించలేదు. దీంతో అనుమానం వచ్చిన కంపెనీ ప్రతినిధులు ఈ నెల 2వ తేదీన రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ ఎం.నాగభూషణ్, బి.కోడూరు ఎస్‌ఐ కె.సి.రాజులు సిబ్బందితో కలిసి గాలిస్తుండగా శుక్రవారం పి.పి.కుంట సమీపంలో ఆకులమహేష్, పూంగవనం శివకుమార్‌లను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఇదే కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న మనీష్ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా నిందితులు నెల్లూరు జిల్లా ముత్తుకూరు స్టేషన్ పరిధిలో కూడా గత నెల 25న ఇదే తరహాలో పామాయిల్ డబ్బాలను లోడ్ చేసుకుని చేర్చవలసిన పాయింట్‌కు చేర్చకుండా కాజేసే యత్నం చేసినట్లు విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుళ్ళు శ్రీను, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.
నకిలీ పత్రాలతో ప్లేవుడ్ బోర్డులు
కాజేసిన యువకులు
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
ఇద్దరు అరెస్టు, పరారీలో ఒకరు