
ఘనంగా బిషప్ పట్టాభిషేకం
కడప కల్చరల్ : కడప కథోలిక మేత్రాసనానికి కొత్త కళ వచ్చింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నూతన బిషప్ పట్టాభిషేకం ప్రభువు దీవెనలు, ఆత్మీయుల అభినందనల మధ్య ఘనంగా సాగింది. ఇంతవరకు బిషప్‌గా సేవలు అందించిన రెవరెండ్ గాలిబాలి ఆధ్వర్యంలో కడప కథోలిక పీఠం నూతన బిషప్‌గా మోస్ట్ రెవరెండ్ సగినాల పాల్‌ప్రకాశ్ పట్టాభిషిక్తులయ్యారు. ఈ సందర్బంగా ఆయన తనను ఇంతగా ప్రేమించి సహకరిస్తున్న విశ్వాసులు, గురువులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కడప కథోలిక మేత్రాసన బిషప్‌గా మోస్ట్ రెవరెండ్ సగినాల పాల్ ప్రకాశ్ బుధవారం మరియాపురంలో ఏర్పాటు చేసిన భారీ ప్రత్యేక వేదికపై పట్టాభిషిక్తులయ్యారు. మరియాపురం బాలుర హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా గురువులు, విశ్వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.గురువులు ప్రత్యేకంగా రూపొందించి అలంకరించిన రథాలలో వాహనాలలో విశ్వాసులతో కలిసి ఊరేగింపుగా వేదిక వద్దకు వచ్చారు. బిషప్ పట్టాభిషేక ప్రాంగణానికి చేరుకోగానే విశ్వాసులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ హల్లెలూయా నినాదాలతో ఆ ప్రాంతాన్ని ప్రతిధ్వనింపజేశారు. తొలుత ప్రత్యేకంగా విచ్చేసిన పోప్ దూత లియోఫోల్డ్ జెరిల్లి నూతన బిషప్‌కు అభినందనలు తెలుపుతూ ప్రసంగించారు. అలాగే ఇంతవరకు బిషప్‌గా సేవలు అందించిన మోస్ట్ రెవరెండ్ గాలి బాలి ప్రసంగించారు. అనంతరం గురువులందరూ మోస్ట్ రెవరెండ్ సగినాల పాల్ ప్రకాశ్‌తో పట్టాభిషేక సంప్రదాయాలను ఆచరింపజేశారు. విశ్వాసులందరికీ దివ్ సత్ప్రప్రసాదం అందజేశారు. కోయర్ బృందాలు నూతన బిషప్‌నుద్దేశిస్తూ గీతాలు ఆలపించారు.
నూతన బిషప్ స్పందన
తనను బిషప్‌గా దీవించిన దైవానికి, అభిమానించిన పోప్‌దూతకు, ఇంతవరకు సేవలు అందించిన గురువులు గాలిబాలికి నూతన బిషప్ కృతజ్ఞతలు తెలిపారు. పోప్ దూత మార్గదర్శనం చేసిన విధంగా ఈ ప్రాంతంలోని యువత, మహిళల ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పట్టాభిషేకం కాగానే గురువులు, విశ్వాసులు ఆయనను అభినందించారు.
తరలివచ్చిన విశ్వాసులు
పెద్ద ఎత్తున విచ్చేసిన
పలు పీఠాల బిషప్‌లు, గురువులు
భారీ వేదికపై సంప్రదాయంగా
ప్రమాణ స్వీకారం
పోప్ దూతలను కలిసిన ఎంపీ
కడప కార్పొరేషన్ : కథోలిక డయాసిస్ బిషప్‌గా సగినాల పాల్ ప్రకాష్ పట్టాభిషేక మహోత్సావాన్ని పురస్కరించుకొని వాటికన్ సిటీ నుంచి కడప నగరానికి విచ్చేసిన అంతర్జాతీయ కథోళిక ప్రతినిధి, పోప్ దూత పూల ఆంతోని, ఇండియా కథోలిక దూత నున్‌సియో లను కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కలిశారు. బుధవారం పోప్ దూతలుగా జిల్లాకు విచ్చేసిన వారిని ఆయన కడప విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారు అవినాష్‌రెడ్డిని ఆశీస్సులు అందజేశారు. అనంతరం నూతన బిషప్‌గా పట్టాభిషిక్తులైన సగినాల పాల్ ప్రకాష్‌కు అవినాష్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా బిషప్ పట్టాభిషేకం