20% పెరిగిన లైసెన్సు ఫీజు | 20% Raised licence fees | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 12 2015 8:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2015-16, 2016- 17 సంవత్సరాలకు ఉద్దేశించిన ఈ విధానం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు సంబంధించి లెసైన్సుల జారీ విధి విధానాలు, చేసిన మార్పులు, ఫీజుల నిర్ణయం తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం మూడు జీవోలు (163, 164, 165) విడుదలయ్యాయి. ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను విక్రయించనున్నారు. 21వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి... 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి దుకాణాలను కేటాయిస్తారు. ఒకేసారి 20 శాతం.. రెండేళ్ల కాలపరిమితితో మద్యం లెసైన్సులు జారీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... లెసైన్సు ఫీజును ఒక్కసారిగా 20 శాతం పెంచేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో మద్యం దుకాణాలకు ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజుకు అదనంగా 20 శాతం పెంచుతూ ఈ కొత్త ఫీజులను నిర్ణయించారు. రెండేళ్లకు ఏటా 10 శాతం పెంచాలని తొలుత భావించినా... వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒకేసారి పెంచారు. ఈ లెక్కన 10 వేల జనాభా ఉన్న గ్రామం, పట్టణం, నగర పంచాయతీల్లో లెసైన్సు ఫీజు రెండేళ్లకు రూ.78 లక్షలు కాగా... 20 లక్షలపైన జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీలో లెసైన్సు ఫీజు రూ.2.16 కోట్లు. ఇక మద్యం అమ్మకాలు లెసైన్సు ఫీజు మొత్తం కన్నా ఏడు రెట్లు దాటితే ప్రస్తుతం అదనంగా 13.6 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా... కొత్త విధానంలో రెండేళ్లకుగాను 8 శాతంగా నిర్ణయించారు. అంటే రెండేళ్ల లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం అమ్మకాలు దాటితే... తర్వాతి అమ్మకాలపై 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు ఫారం వెలను రూ.25వేల నుంచి రూ.50వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement