కొత్త జిల్లాల్లో పని చేసేందుకు అదనపు ఉద్యోగులు కావాలని, మొత్తం 3,252 పోస్టులు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి వీటిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించిన ప్రభుత్వం ఉద్యోగుల కేటాయింపుల తుది ప్రణాళికపై మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఆవిర్భావం రోజు నుంచే కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వ సిబ్బందిని అందుకు సిద్ధంగా ఉంచాలని సీఎం కార్యాలయ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ కార్యాలయాలు మొదటి రోజు నుంచే పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో వివిధ శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, వసతి సదుపాయాలతోపాటు ఉద్యోగుల కేటాయింపు, అందుకు సంబంధించిన ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు.