రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల పంటభూములు లాక్కొని రైతుల పొట్టగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల పేరుతో సరికొత్త భూదందాకు తెరలేపింది.నిరుపేదల భూములను లాక్కొని ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలకే అంతర్జాతీయ విమానాశ్రయాల కోసమంటూ వైమానిక విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం వేల ఎకరాలు సేకరిస్తామని ఒకసారి, సమీకరిస్తామని మరోసారి చెప్పుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో భూ సేకరణ ఆర్డినెన్స్‌పై కేంద్రం వెనక్కి తగ్గినా... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో 5,311 ఎకరాలు, చిత్తూరుజిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో 1,398 ఎకరాలు, కర్నూలుజిల్లా ఓర్వకల్లు, నెల్లూరుజిల్లా దగదర్తిలో 3,407 ఎకరాలు పేదల భూములు కాజేసేందుకు సిద్ధమైంది.