‘సమైక్య’ ప్రకటన వెలువడే వరకూ సమ్మె | APNGOs:AP Strike Continue Govt Change Decision on State Division | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 17 2013 7:18 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కానుంది. సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకుని కేంద్రం సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన చేసే వరకూ సీమాంధ్రలో సమ్మె కొనసాగుతూనే ఉంటుందని ఏపీఎన్జీవోలు ప్రకటించారు. కేంద్రం దిగి రాకుంటే దిగొచ్చేలా ఆందోళనా కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటం తరువాత ఆ స్థాయిలో అన్ని జిల్లాల్లో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమాలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సంఘం నేతలు పేర్కొన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నెల 19వ తేదీ నుంచి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ర్యాలీలు.. రోడ్ల దిగ్బంధం ఈ నెల 19 మొదలు వివిధ రకాల ఆందోళనలు నిర్వహించనున్నామని అశోక్‌బాబు చెప్పారు. 19న అన్ని జిల్లాల్లోనూ భారీ నిరసన ర్యాలీలు జరుగుతాయన్నారు. 20న ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ ఉన్న అన్ని రహదారుల్ని పూర్తిస్థాయిలో నిర్బంధిస్తామని, ఎన్జీవోలు రోడ్లపై బైఠాయించి రాస్తారోకోలు నిర్వహిస్తారని తెలిపారు. 21న ఉదయం 10-11 గంటల మధ్య అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ‘జై సమాక్యాంధ్ర’ నినాదంతో మానవహారాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే రోజు సాయంత్రం 6-7 గంటల మధ్య ఆయా జిల్లాల్లో కాగడాలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 22, 23 తేదీల్లో రిలేదీక్షలు జరుగుతాయనీ, మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో మూడంచెలుగా ఈ దీక్షల్ని నిర్వహించేందుకు తీర్మానం చేశామని వివరించారు. 24 నుంచి నెలాఖరు వరకూ జరిగే వివిధ రకాల నిరసన కార్యక్రమాలు, ఆందోళనల్లో ఎన్జీవోల కుటుంబసభ్యులు, బంధువుల్ని కూడా భాగస్వాముల్ని చేయనున్నామన్నారు. త్వరలో ‘హైదరాబాద్ మనది’ రాజధాని నడిబొడ్డున ‘హైదరాబాద్ మనది’ అన్న నినాదంతో త్వరలో భారీ సమైక్య సదస్సును నిర్వహిస్తామని అశోక్‌బాబు తెలిపారు. దీనికంటే ముందు శ్రామికవర్గాలతో ప్రత్యేక అవగాహన సభను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సదస్సు పెట్టి తీరతామని తేల్చిచెప్పారు. తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచే రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో మంచి ఆదరణ ఉండేలా చూస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు సమైక్య వాదంతో పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బస్సులు నడిపితే సహించం తిరుపతిలో కొందరు ఉన్నతాధికారులు ఆర్టీసీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తిరుమల కొండపైకి బస్సులు నడిపేలా బెదిరింపులకు దిగుతున్నారనీ, దీన్ని ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చేందుకు ప్రత్యేక జీవో జారీ చేసిందని, దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడిపితే శనివారం నుంచి అడ్డుకుంటామని అశోక్‌బాబు హెచ్చరించారు. 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ప్రత్యేక ఫోరంగా ఏర్పడి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమయ్యార ని తెలిపారు. ఆంటోనీ కమిటీ చర్చల కోసం ఢిల్లీ రమ్మని పిలిస్తే అన్ని సంఘాలను పిలవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ, కోస్తా జిల్లాల్లో ప్రైవేటు ఆపరేటర్ల లాబీయింగ్ ఎక్కువగా ఉంటుందనీ, లాభాపేక్షతో ఎవరైనా బస్సులు నడిపితే సహించబోమని హెచ్చరించారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాల్సిందే విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణాయాదవ్ మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసి ఉద్యమంలోనికి రావాల్సిందేనన్నారు. లేకుంటే వారిళ్ల ముందే వారి దిష్టిబొమ్మల్ని తగులబెడతామన్నారు. ఇంకా అవసరమైతే వారికి బొందబెట్టి వారి స్థానంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో జరిగే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇప్పటివరకు టెస్ట్‌మ్యాచ్‌లు ఆడిన తాము ఇకపై ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడతామన్నారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సంఘ ప్రతినిధి శ్యాంసుందర్ మాట్లాడుతూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సమ్మెలోనికి వెళ్తున్నట్లుగా శుక్రవారం మేనేజ్‌మెంట్‌కు నోటీసు ఇచ్చామన్నారు. శనివారం నుంచి రాష్ట్రంలోని 58,850 మంది గెజిటెడ్ అధికారులు సమ్మెకు దిగుతున్నట్లు ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి కృష్ణమోహన్‌రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత గోపరాజు, ఏపీ గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడు బషీర్, కోశాధికారి వీరేంద్రబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 2 నుంచి ‘విద్యుత్’నిరవధిక సమ్మె రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు సమైక్య ఆంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఎస్‌ఏవీఈ (సేవ్) జేఏసీ 29) ప్రకటించింది. ట్రాన్స్‌కో, జెన్‌కోతో పాటు ఎస్‌పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌లలో సమ్మెకు దిగనున్నట్టు సేవ్ జేఏసీ చైర్మన్ ఆర్.సాయిబాబా, కన్వీనర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందాతో పాటు జెన్‌కో ఎండీ విజయానంద్‌కు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు నర్సింహులు, రవిశంకర్, మురళీకృష్ణారెడ్డి, ప్రత్యూష, అనురాధ, సముద్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం దశలవారీగా ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. ఈ నెల 17, 18వ తేదీల్లో ప్రధాన కార్యాలయాల వద్ద ర్యాలీలు చేపడతారు. 19, 20, 21 తేదీల్లో జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బైకు ర్యాలీలు, 22, 23, 24 తేదీల్లో రాస్తారోకోలు, 25న జిల్లా కేంద్రాల్లో వంటావార్పు, 26 నుంచి 28 వరకూ మౌన ప్రదర్శనలు నిర్వహిస్తారు. 29 నుంచి 31వ తేదీ వరకు రాజీనామా చేయని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని, సెప్టెంబర్ 1న వంటావార్పు చేపడతామని జేఏసీ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. రవాణా చెక్‌పోస్టులు బంద్ రవాణా శాఖ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్టీఓలు అడ్‌హాక్ కమిటీగా ఏర్పడి సీమాంధ్రలోని చెక్‌పోస్టులన్నింటినీ బంద్ చేయాలని నిర్ణయించినట్లు కమిటీ చైర్మన్ జె.రమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 13 జిల్లాల్లోని ఎనిమిది చెక్‌పోస్టులు మూతపడ్డాయని తెలిపారు. శుక్రవారం నుంచి సీమాంధ్రలో ఉన్న 300 మంది మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, 15 మంది ఆర్టీఓలు నిరవధిక సమ్మెకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అడ్‌హాక్ కమిటీ కన్వీనర్‌గా కందుకూరు ఎంవీఐ డీవీ రావు నియమితులయ్యారు. రేపు అర్ధరాత్రి నుంచి న్యాయశాఖ ఉద్యోగుల సమ్మె ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి నుంచి సీమాంధ్ర జిల్లాలోని న్యాయశాఖ ఉద్యోగులంతా సమ్మెకు దిగుతున్నట్లు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.వై.నరసింహం తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టుకు సమ్మె నోటీసు ఇచ్చినట్లు ఆయన శుక్రవారం విశాఖపట్నంలో వెల్లడించారు. నేడు లైట్లు ఆర్పి నిరసన సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిరసన తెలుపాలని జేఏసీ చైర్మన్ సాయిబాబా ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేంతవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. శుక్రవారం గుంటూరులోని ఎన్జీవో హోంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో సమైక్య జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ఎన్జీవో సంఘ నేతలు, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ జరిగిన భేటీలో నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబుతో పాటు వివిధ విభాగాల ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని సమావేశం తీర్మానించిందని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement