ఓటుకు కోట్లు కేసులో ఏ-4 నిందితుడు జెరూసలెం మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై జరుపుతున్న విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు తన నిర్ణయాన్ని సోమవారం వెలువరిస్తానని స్పష్టం చేశారు. మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ తీరును, విచారణ సమయంలోని పరిణామాలను బట్టి ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ, కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ స్టీఫెన్‌సన్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.