వాయుగుండం ప్రభావంతో తీరంలో ‘అల’జడి నెలకొంది. ఉప్పాడ సమీపంలోని తీరప్రాంతం వెంబడి ఉన్న బీచ్‌రోడ్డు కడలి ఆగ్రహానికి గురై ముక్కలైంది. కాకినాడ–ఉప్పాడల మధ్య బీచ్‌రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. శుక్రవారం ఉదయం సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్ర కోతకు గురైంది. పలువురి మత్స్యకార గృహాలు ధ్వంసమయ్యాయి. ఉప్పాడ తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణగోడ సైతం కెరటాల ఉధృతికి ధ్వంసమైంది. పలుచోట్ల అండలుజారడంతో సముద్రపునీరు గ్రామంలోకి చొచ్చుకువస్తోంది. బీచ్‌రోడ్డు వెంబడి వేసిన రాళ్లగోడ సైతం కెరటాల తాకిడికి చెల్లాచెదురైంది. తీరంలో కెరటాలు సుమారు ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ తీరప్రాంతాన్ని తీవ్ర కోతకు గురిచేస్తున్నాయి. ఉప్పాడ తీరం వెంబడి ఉన్న పంట పొలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో పంట పొలాలు చౌడుబారే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.