గనుల తవ్వకాలు జరపకూడని ప్రాంతంలో ప్రభుత్వం ఏపీఎండీసీకి సున్నపురాయి నిక్షేపాలను రిజర్వు చేయడం చట్ట విరుద్ధమని, అందువల్ల దీనిని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని గుంటూరు జిల్లాకు చెందిన టీజీవీ కృష్ణారెడ్డి ఎన్‌జీటీని ఆశ్రయించారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే పులిచింతల నిర్వాసిత కాలనీ వాసులు దుమ్ము, కాలుష్యం బారిన పడతారని పిటిషన్‌లో పేర్కొన్నారు. డేంజర్ జోన్‌లో ఉన్నందున ఇక్కడ తవ్వకాలు జరపడం ప్రమాదకరమని కూడా వివరించారు. ఇందుకు సంబంధించి గతంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), గనుల భద్రత సంచాలకులు ఇచ్చిన నివేదికలను కూడా ఆధారాలుగా సమర్పించారు. ఏపీఎండీసీని పావుగా వాడుకుని అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పులను ఒప్పులుగా మార్చడం, టెండరు పేరుతో ఖనిజ నిక్షేపాలను కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టీకరించారు.