కృష్ణా జలాల వివాదంపై అంతా అనుమానిస్తున్నట్టే జరిగింది! కృష్ణా నీళ్ల పంచాయితీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే పరిమితం చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. నదీ జలాలను నాలుగు రాష్ట్రాలకు కలిపి కేటాయించాలంటూ రెండేళ్లుగా తెలంగాణ చేస్తున్న వాదనలకు నీళ్లొదిలింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారనుంది. మున్ముందు మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎంఆర్‌పీ వంటి ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. అంతేకాదు ఎగువ రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆశలన్నీ సుప్రీంకోర్టుపైనే పెట్టుకుంది.