వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ నిండిపోయింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో దారులన్నీ ఎస్పీజీ గ్రౌండ్‌కే అన్నట్లుగా మారింది. సభకు వెళ్లకుండా టీడీపీ నేతలు ప్రలోభపెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా జనం కదం తొక్కుతూ ముందుకు కదిలారు. వేలాదిగా జనం తరలివచ్చారంటే ఇదే వైఎస్ జగన్‌పై ఉన్న ప్రేమకు నిదర్శనమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ జనాన్ని చూసి చంద్రబాబు గుండె పగిలిపోవడం ఖాయమని, టీడీపీ అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకొని పారిపోతారేమోనని ఎద్దేవా చేశారు. నంద్యాల పట్టణంతో పాటు రూరల్ మండలాల నుంచి వచ్చిన జనంతో సభా ప్రాంగణం పోటెత్తింది. ఎస్పీజీ మైదానానికి చేరుకున్న జగన్.. వేదికపైకి రావడానికి దాదాపు 10 నిమిషాలు పట్టిందంటేనే పరిస్థితి అర్థమవుతుంది. ఎస్పీజీ గ్రౌండ్‌కు చేరుకున్న జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు.