కేతరినాథ్‌లో ఇప్పటికి బయటపడుతున్న మృతదేహాలు | Dead bodies found in Kedarnath | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 5 2013 2:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM

భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడటంతో ప్రకృతి విలయతాండవం చేసిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో 64 మృతదేహాలు బయటపడ్డాయి. వాతావరణం కాస్త సాధారణ స్థితికి చేరుకోవడంతో గత కొన్ని రోజులుగా అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో, కేదార్ లోయ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 64 మృతదేహాలను కనుగొన్నారు. వాటికి అంత్యక్రియలు కూడా పూర్తి చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జూన్ నెలలో ప్రకృతి ఉత్పాతం సంభవించినప్పుడు భయంతో కొండల మీదకు ఎక్కినవారే ఇలా మృత్యువాత పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. విపరీతమైన చలి కారణంగానే వీరంతా చనిపోయి ఉండొచ్చని ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్ఎస్ మీనా తెలిపారు. గడిచిన రెండు రోజుల్లో మొత్తం 64 మృతదేహాలకు రాంబాడా, కేదార్నాథ్ ప్రాంతాల మధ్యలో దహన క్రియలు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. పర్వత ప్రాంతాలలో చిక్కుకున్న మృతదేహాలను గుర్తించేందుకు తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, ఇంతకుముందు వాతావరణం బాగోని కారణంగా అక్కడకు వెళ్లలేకపోయామని ఆయన చెప్పారు. వాతావరణం సహకరిస్తే, మరికొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రధానంగా జంగల్ ఛత్తి, రాంబాడా, గౌరీగావ్, భీమ్బాలి ప్రాంతాల్లో ఈ గాలింపు ఉంటుందన్నారు. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మృత్యువాత పడి ఉండొచ్చని అంచనా. వాతావరణం బాగుపడటంతో పాటు.. సెప్టెంబర్ 11వ తేదీన ఈ ప్రాంతంలో పూజలు పునఃప్రారంభం కావాల్సి ఉండటం కూడా అధికారులు త్వరపడటానికి కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి బహిరంగ ప్రదేశాల్లో ఉన్న మృతదేహాలనే బయటకు తీస్తున్నాం తప్ప శిథిలాల కింద చిక్కుకుపోయినవాటి గురించి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదని డీజీ మీనా తెలిపారు. డీజీపీ సత్యవ్రత బన్సల్తో కలిసి ఆయన కేదార్నాథ్ ప్రాంతంలో పర్యటించారు. దాదాపు 30 మంది పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రస్తుతం అక్కడ సహాయ కార్యకలాపాల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement