ప్రస్తుతం స్విమ్స్‌లో చర్చనీయాంశం గా మారిన టెండర్ల రద్దు వ్యవహారంలో ఇద్దరు డిప్యూటీ డెరైక్టర్లదే కీలక మంత్రాంగమని తెలుస్తోంది. అధికార పార్టీ పెద్దల ఆశీ స్సులు పుష్కలంగా ఉన్న వీరిద్ధరి నిర్ణయాలకు ఎదురు చెప్పే ధైర్యం లేక టెండరు కమిటీల్లోని మిగతా సభ్యులు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే విషయంలో వెనుకంజ వేస్తున్నారు. తాజాగా చోటుచేసుకున్న పరి ణామాలను పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతోంది. స్విమ్స్‌లో శానిటేషన్, పారామెడికల్, సెక్యూరిటీ, నాన్‌పారా మెడికల్ ఉద్యోగుల సరఫరా కోసం అక్టోబరు 6న పిలిచిన రూ.1.65 కోట్ల టెండరును అదే నెల 28న తెరిచారు. ఇందులో ఎల్-1గా నిలిచిన చైతన్యజ్యోతి సొసైటీకి వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సిన తరుణంలో టెండర్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధికారికంగా బయటికి వచ్చిన కారణాలు ఏమైనప్పటికీ అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్ల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న డిప్యూటీ డెరైక్టర్లు బంధుప్రీతితో టెండర్ల రద్దుకు చక్రం తిప్పారని తెలుస్తోంది. అధికార పార్టీ లోని కొందరు మంత్రులు, వారి వద్ద పనిచేసే వ్యక్తులు ఇందులో తలో చేయి వేశారు.