వంటింట్లో ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో ఇప్పటికే కిలో రూ. 55 పలుకుతుండగా, రానున్న నాలుగు రోజుల్లో రూ.70కి చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రజల ఉల్లి అవసరాలను తీరుస్తున్న తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు తారాజువ్వలా దూసుకెళుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో రవాణా స్తంభించడం, మహారాష్ట్రలో కృత్రిమ కొరత వంటి పరిస్థితుల నేపథ్యంలో డిమాండ్‌కు తగిన స్థాయిలో సరఫరా లేక ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో ముందెన్నడూ కిలో రూ. 20 దాట లేదు. కానీ.. ఈసారి హోల్‌సేల్ మార్కెట్‌లోనే కిలో రూ.50 పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లోకి వచ్చేసరికి ఆ ధర కాస్తా రూ. 55కు చేరింది. మహారాష్ట్ర రకం ఉల్లిపాయల విషయానికొస్తే సోమవారం పదికిలోలు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ. 575 నుంచి రూ.600 పలికింది. మహారాష్ట్ర ఉల్లిపాయలు సైతం ఇంత ఘాటెక్కడం ఇదే ప్రథమం. ఇవి మూడు నెలలపాటు నిల్వ ఉంటాయి. దీంతో ఈ రకం మరింత ఘాటెక్కుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా బస్సురవాణా పూర్తిగా స్తంభించింది. లారీలు కూడా బయల్దేరిన తర్వత ఎంత సేపటికి గమ్యం చేరుకుంటాయో చెప్పలేని పరిస్థితి. దీంతో ఉల్లిపాయల రవాణా దాదాపుగా నిలిచిపోయింది. దీనివల్ల ధరలు మరింత వేడెక్కుతున్నాయి. సమ్మె ముగిసే అవకాశాలు కూడా ఇప్పట్లో కనిపించకపోవడంతో.. ఇంకెంత పెరుగుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.