జననేతకు బెయిల్‌తో జగమంతా సంబరాలు | Family, YSR Congress workers celebrate Jagan Reddy's bail | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 24 2013 6:59 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ, ఉద్విగ్నతల మధ్య నలిగిపోయిన జిల్లా ప్రజలు.. సాయంత్రం ఉత్కంఠ వీడిపోవడంతో సంబ రాల్లో మునిగితేలారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై బనాయించిన కేసుల్లో సీబీఐ దర్యాప్తు పూర్తి కావడం, ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారం వెలువడనున్నట్లు వార్తలు రావడంతో ఉదయం నుంచే ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. న్యూస్ చానల్స్ చూస్తూ ఉత్కంఠతో కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూశారు. ఉదయమే సీబీఐ కోర్టులో నోట్ దాఖలు చేసింది. జగన్‌పై నమోదైన 8 కేసుల్లో క్విడ్‌ప్రోకోకు ఆధారాలు లేవని అందులో పేర్కొనడం.. హైకోర్టు ఆదేశించిన అన్ని కేసుల్లోనూ దర్యాప్తు పూర్తి చేశామని నోట్‌లో వివరించినట్లు చానళ్లలో వార్తలు రావడంతో జగన్‌కు బెయిల్ తప్పకుండా వస్తుందని భావించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు తీర్పు రాకపోవడంతో భోజన విరామం అనంతరం తీర్పు వెలువడుతుందని భావించారు. అదే ఉత్సుకతతో టీవీలు చూస్తూ గడిపారు. అయితే గంటలు గడుస్తున్నా తీర్పు వెలువడకపోవడంతో ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ మళ్లీ బెయిల్ నిరాకరిస్తారేమోనన్న అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు జగన్‌కు బెయిల్ మంజూరైనట్లు బ్రేకింగ్ న్యూస్ రావడంతో కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులతోపాటు సామాన్య ప్రజలు పరస్పరం అభినందనలు చెప్పుకొంటూ మిఠాయిలు పంచుకున్నారు. వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాల లు వేసి నివాళులర్పించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. యువకులు పార్టీ పతాకాలు పట్టుకొని బైకులపై ఊరంతా తిరిగి సందడి చేశారు. సమైక్యాంధ్ర దీక్షల్లో ఉన్న నాయకులు కూడా జగన్‌కు బెయిల్ లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ మినహా, ఏ రాజకీయ పార్టీ సమైక్యాంధ్ర కోసం కనీసం ప్రకటనలు కూడా చేయకపోవడం, ఒకటి, రెండు పార్టీలు చేస్తున్నా ద్వంద్వ విధానాలు అవలంభిస్తుండడంతో వారు ఆ పార్టీలను నమ్మటం లేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ లభించడంతో తమ పోరాటానికి అండగా నిలబడే నాయకుడు దొరికాడని వారంతా భావిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement