శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ దోపిడీకి పాల్పడుతోందంటూ కేంద్ర జల వనరుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసింది. గత 12 రోజుల్లో 5.05 టీఎంసీల నీటిని తరలించుకుపోయి లెక్కల్లో 1.83 టీఎంసీలనే చూపుతోందని వివరించింది. జల దోపిడీపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసినా.. ఏపీ వైఖరిలో మార్పులేదని పేర్కొంది. నీటి వినియోగం లెక్కలపై సంయుక్త కమిటీ వేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినా.. కృష్ణా బోర్డు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని తెలిపిం ది. ఇప్పటికైనా తెలంగాణ, ఏపీ, కృష్ణా బోర్డు అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటి వినియోగాన్ని లెక్కలతో సహా అందులో వివరించారు. ఈ వ్యవహారం లో బోర్డు ప్రేక్షక పాత్రను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.