రాష్ట్ర రాజధానికి తలమానికంగా మరో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే దేశంలో ఐటీ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న హైదరాబాద్ తాజాగా ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) రూపంలో మరింత ప్రఖ్యాతిగాంచనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఐటీఐఆర్‌లో దాదాపు రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) సంస్థల ఏర్పాటుకు రూ. 1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ సంస్థల ఏర్పాటుకు 1.01 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు ఉంటాయి. ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 56 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా. ఐటీఐఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు క్లస్టర్లలో 202 చదరపు కిలోమీటర్ల భూమిని కేటాయించింది. సైబరాబాద్ డెవలప్‌మెంట్ ఏరియా, దాని పరిసరాల్లో ఒక క్లస్టర్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఏరియా, మహేశ్వరంలో మరో క్లస్టర్, ఉప్పల్, పోచారం ఏరియాలో ఇంకో క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు తొలి దశను 2013 నుంచి 2018 వరకూ అమలు చేస్తారు. రెండో దశ అమలు 2018 నుంచి 2038 వరకూ ఉంటుంది. ఉత్పత్తి యూనిట్లు, ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన యంత్రాంగం, నివాస ప్రాంతం, పరిపాలన సేవలు అన్నీ ఐటీఐఆర్‌లో భాగమై ఉంటాయి. స్పెషల్ ఎకానమిక్ జోన్ (ఎస్‌ఈజెడ్)లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్‌హౌసింగ్ జోన్లు, ఎగుమతులకు సంబంధించిన యూనిట్లు, అభివృద్ధి కేంద్రాలు ఇందులో భాగంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం సచివాలయంలో ఈ విషయం మీడియాకు వెల్లడించారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సంస్థల ఏర్పాటుకు అవసరమైన సమీకృత నాలెడ్జి క్లస్టర్లు ఏర్పాటుచేయాలని, ఇందుకు రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం 2008 మే 29న విధానపర నిర్ణయంలో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ కమిటీ తాజాగా ఆమోదం తెలిపిన నేపధ్యంలో.. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే మంత్రిత్వశాఖలు ఈ ప్రాజెక్టు అమలుపై సవివరమైన అధ్యయనం, చర్యలు ప్రారంభించనున్నాయి. ఐటీఐఆర్ వల్ల లబ్ధి ఇలా... - ప్రత్యక్ష రెవెన్యూ: రూ. 3,10,849 కోట్లు - ఐటీ పెట్టుబడుల సామర్థ్యం: రూ. 2,19,440 కోట్లు - ఐటీ ఎగుమతులు: రూ. 2,35,000 కోట్లు - ప్రత్యక్షంగా ఉద్యోగాలు: 14.8 లక్షల మందికి - పరోక్షంగా ఉపాధి: 55.9 లక్షల మందికి - రాష్ట్రానికి అదనంగా లభించే పన్ను ఆదాయం: రూ. 30,170 కోట్లు స్వరూపం ఇదీ... - మొత్తం 202 చదరపు కిలోమీటర్ల (50 వేల ఎకరాలు) పరిధిలో ఏర్పాటు - 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ఏర్పాటు - సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో) పరిధిలో - హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) పరిధిలో - ఉప్పల్, పోచారం పరిధిలో మరొక క్లస్టర్ - ఈ మూడు క్లస్టర్లను అనుసంధానిస్తూ మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్ విస్తరిస్తుంది మూడు క్లస్టర్ల విస్తీర్ణం... 1. హెచ్‌ఎండీఏ (సైబరాబాద్ ఏరియా పరిసరాలు): 86.7 చదరపు కిలోమీటర్లు 2. హెచ్‌ఎండీఏ (ఎయిర్‌పోర్టు ఏరియా): 79.2 చదరపు కిలోమీటర్లు 3. ఉప్పల్, పోచారం: 10.3 చదరపు కిలోమీటర్లు కనెక్టివిటీలో భాగంగా - ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) గ్రోత్ కారిడార్ 1: 11.5 చ.కి.మీ. - ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) గ్రోత్ కారిడార్ 2: 14.3 చ.కి.మీ
Published Sat, Sep 21 2013 10:44 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
Advertisement