రాష్ట్రంలో నూటికి 90 శాతం మంది సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమైక్యంగా ఉంటే అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం వస్తుందని ఆయన శనివారమిక్కడ తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జేఎసి ఆధ్వర్యంలో బెజవాడలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన మౌనదీక్షలో లగడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్రంలో వేర్పాటు వాదం వచ్చిందని ఆయన అన్నారు. వేర్పాటువాదులకు టీడీపీ తొత్తుగా మారిందన్నారు. అసెంబ్లీల్లో విభజనపై బిల్లు పెడితే అడ్డుకుంటామని లగడపాటి హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నష్టమే కాని లాభం లేదన్నారు. ఉద్యమాల ద్వారానే సమైక్యాంధ్ర సాధించుకుందామని లగడపాటి సూచించారు. తమ స్టార్ బ్యాట్మెన్స్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారని, లక్ష్యం సాధించేవరకూ బ్యాటింగ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు లగడపాటి వ్యాఖ్యానించారు. ప్రజలు ఉద్యమిస్తే సమైక్యాంధ్ర సాధ్యమని ఆయన అన్నారు.