మండుతున్న ముజఫర్‌నగర్ | Mujapharnagar is burning | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 10 2013 7:56 PM | Last Updated on Thu, Mar 21 2024 9:11 AM

మత ఘర్షణలతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి.అల్లర్లలో మరణించినవారి సంఖ్య ఆదివారం నాటికి 21కి చేరింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం భారీగా బలగాలు మోహరించింది. అయినా అల్లర్లు అదుపులోకి రావడం లేదు. జిల్లాలోని సివిల్ లైన్స్, కొత్వాలి, నైనీ మండి ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసు, పీఏసీ బలగాలు కవాతు చేశాయి. ‘‘ఇప్పటిదాకా అల్లర్లలో 21 మంది మరణించారు. కొందరి ఆచూకీ లభించడం లేదు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు’’ అని జిల్లా కలెక్టర్ కౌశాల్ రాజ్ శర్మ వెల్లడించారు. శనివారం రాత్రి నుంచి పరిస్థితి కాస్త అదుపులోనే ఉంద ని, ఇప్పటిదాకా 30 మందిని అరెస్టు చేశామని పోలీసు అదనపు డెరైక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ తెలిపారు. అల్లర్లను అదుపు చేసేందుకు ఆర్మీ బలగాలతోపాటు 10 వేల మంది పీఏసీ, 1300 మంది సీఆర్‌పీఎఫ్, 1200 మంది ఆర్‌ఏఎఫ్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. శనివారం చెలరేగిన హింసాకాండలో ఐబీఎన్7 చానల్ పార్ట్‌టైమ్ విలేకరి రాజేశ్ వర్మ, పోలీసులు కుదుర్చుకున్న ఒక ఫొటోగ్రాఫర్‌తోపాటు 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వీడియో రేపిన చిచ్చు..! ముజఫర్‌నగర్ జిల్లా కావాల్ గ్రామంలో ఆగస్టు 27న ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవడం, తదంనతర పరిణామాలతో అల్లర్లు చెలరేగుతున్నాయి. ‘‘కావాల్ గ్రామంలో ఇటీవల ఒక సంఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన నకిలీ వీడియోలను ఎవరో ఇంటర్‌నెట్‌లో పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ వీడియోను ఇంటర్‌నెట్ నుంచి తీసివేసినా గ్రామంలో ఆ ఘటనకు సంబంధించిన సీడీలు పంపిణీ అయ్యాయి. దీంతో ఒక వర్గానికి సంబంధించినవారు మహాపంచాయితీ తలపెట్టడంతో చుట్టుపక్కల ఊళ్లవారు కూడా వచ్చారు. ఫలితంగా శాంతిభద్రతల సమస్య తలెత్తింది’’ అని పోలీసులు వివరించారు. జిల్లాలో ఓ చోట్ల కొందరు దుండగులు ఆర్మీ జవాన్లపైకి కాల్పులు జరిపారని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కమల్ సక్సేనా చెప్పారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు బలగాలకు ఇచ్చారా అని ప్రశ్నిచంగా.. పరిస్థితి అదుపు తప్పుతుందని భావిస్తే కాల్పులు జరిపేందుకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. కాగా, పొరుగు జిల్లా మీరట్‌కు కూడా అల్లర్లు వ్యాపించినట్లు వదంతులు వచ్చాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఆ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలు, మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యూపీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పక్కనున్న ఉత్తరాఖండ్ కూడా అప్రమత్తమైంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం యూపీ సర్కారు నుంచి నివేదిక కోరింది. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని హోంశాఖ సూచించింది. ఎస్పీ కన్నా బీఎస్పీ పాలనే నయం: దిగ్విజయ్ న్యూఢిల్లీ: యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంటే బీఎస్పీ పాలనే నయమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అల్లర్లను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సామాజిక వెబ్‌సైట్‌లో మండిపడ్డారు. అల్లర్ల నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement