పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్నప్పుడు 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఇప్పుడు చెల్లవని రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది.ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి చాలా కాలం అయినా ఇప్పటి వరకు సమాధానం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించింది.రెండు వారాల్లోపు స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.గడువు పొడిగించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యర్థించినా ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది. ఆ రోజు ప్రాజెక్టు నిర్మాణంపై మధ్యంతర స్టే విధింపుపై విచారణ చేపడతామని పేర్కొంది.