‘ఓటుకు కోట్లు’ వ్యవహారమంతా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పర్యవేక్షణలోనే జరిగినట్లు ఏసీబీ నిగ్గుతేల్చింది. బాబు డైరెక్షన్‌లోనే ఈ కుట్ర జరిగినట్లు ఈ వ్యవహారంలో భాగస్వాములైన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు సెబాస్టియన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు నిర్ధారిస్తున్నాయి. దాదాపు రూ. 150 కోట్ల ఈ కుంభకోణం కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు జరిగిన వ్యూహ రచనను మంగళవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి అందజేసిన ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు సెబాస్టియన్ ద్వారా సండ్ర నడిపిన మంత్రాంగానికి సంబంధించిన కాల్ రికార్డులను, ఎవరెవరితో సంభాషణలు జరిపారనే మొత్తం తతంగాన్ని న్యాయస్థానం ముందుంచింది.