వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షను భగ్నం చేసినందుకు, ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లిన తీరుకు నిరసనగా సీమాంధ్ర అంతటా బంద్ పాటిస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేయడం పట్ల, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా వైఎస్ఆర్ సిపి సీమాంధ్ర బంద్కు పిలుపు ఇచ్చింది. ఈ పిలుపుకు సీమాంధ్ర అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది. సీమాంధ్రలోని 13 జిల్లాలలో బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలను మూసివేశారు. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. విజయవాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతి వంటి పట్టణాలలో వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనా కార్యక్రమాలు ఉధృతం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ జడ్పీ ఛైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వరంలో బంద్ నిర్వహిస్తున్నారు. వైఎఎస్ఆర్ జిల్లా కడప అప్సర సర్కిల్ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. పులివెందులలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. ఎమ్మెల్యే బాలరాజు పశ్చిమ గోదావరి జిల్లా బంద్కు పిలుపు ఇచ్చారు. తాడేపల్లి గూడెంలో పార్టీ అధ్యక్షుడు తోట గోపి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. అనంతపురంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు రహదారులను దిగ్బంధినం చేశారు. వారి ఆందోళనకు ఉపాధ్యాయసంఘాలు మద్దతు తెలిపాయి. వైఎస్‌ఆర్‌సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. గుత్తి, పామిడి, రాప్తాడు, పెనుకొండలలో రహదారులను దిగ్భందించారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్నారు. విశాఖలోని మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్, గాజువాకలో సమైక్యవాదుల రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. నెల్లూరు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్‌లో విద్యార్థులు రాస్తా రోకో చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను కదలనివ్వడంలేదు. విజయవాడలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో కళాశాలలు, దుకాణాలు బంద్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు.
Published Sat, Aug 24 2013 10:58 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
Advertisement