రోడ్డుప్రమాదంలో ‘సాక్షి’ విలేకరి దుర్మరణం | Sakshi daily scribe killed in road mishap | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 28 2013 7:41 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

‘సాక్షి’ దినపత్రిక నార్సింగ్ ఏరియా సీనియర్ విలేకరి డి.బాలరాజు(38) ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తన ద్విచక్రవాహనంపై నార్సింగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో బండ్లగూడ వద్ద రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెను తప్పించేక్రమంలో వాహనం అదుపుతప్పడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన బాలరాజును రక్షించేందుకు స్థానికులు 108కు ఫోన్ చేశారు. అరగంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది బాలరాజు అప్పటికే మృతి చెందాడని చెప్పి వెళ్లిపోయారు. అయితే, బాలరాజు శరీరంలో కదలికలు గుర్తించిన స్థానికులు, అతని సన్నిహితులు మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సుమారు 2 గంటలపాటు బాలరాజు ప్రాణాలను కాపాడేందుకు యత్నించినా ఫలితం కనిపించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందితే బావుండేదని, ఆలస్యం కావడంతో ప్రాణాలు కాపాడలేకపోయామని వైద్యు లు పేర్కొన్నారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. బాలరాజుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలరాజు మృతికి సాక్షి దినపత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళి సంతాపం వ్యక్తం చేశారు. నిబద్ధత గల జర్నలిస్టని కొనియాడారు. బాలరాజు మరణంపట్ల వివిధ జర్నలిస్టు సంఘాలు కూడా సంతాపం తెలిపాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement