ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సొంత ఊర్లో గెలవలేమని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ చేత మెదక్‌లో పోటీ చేయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి విమర్శించారు. రైల్వే కోడూరులో కొరముట్ల శ్రీనివాసుల దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం పది సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన ఘనత సోనియా గాంధీనని మైసూరా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం చేతిలో ఉందని ఎస్మా ప్రయోగిస్తే భయపడేవారేవరూ లేరన్నారు. ఓట్ల కోసం-సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని మైసూరా హెచ్చరించారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటాలు ఆగవని మరోమారు స్పష్టం చేశారు.కాగా, రాజంపేటలో దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేత అమర్‌నాథ్ రెడ్డికి మైసూరా సంఘీభావం ప్రకటించారు.