3 నెలల్లో ‘విభజన’! | State bifurcation in three months confirms congress high command | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 6 2013 7:32 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ ఆంధ్ర, రాయలసీమల్లో గత 36 రోజులుగా ఉవ్వెత్తున ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను మౌనంగా స్థిరంగా ముందుకు తీసుకెళుతున్నాయి. ‘విభజన ప్రక్రియను ఇక మరింత జాప్యం లేకుండా వేగవంతం చేయటానికి మేం కృషిచేస్తున్నాం. మూడు నెలల్లోగా మొత్తం సిద్ధం చేయాలి. ఈ ఏడాది చివరికల్లా (ఆంధ్రప్రదేశ్‌లో) రెండు ప్రభుత్వాలు ఏర్పాటు కావటం మా లక్ష్యం. అలా జరగనిపక్షంలో.. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైనట్లయితే.. ప్రభుత్వాన్ని సుప్తచేతనావస్థలో ఉంచుతాం. కానీ.. ప్రక్రియ మాత్రం ఆగదు’ అని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు స్పష్టంచేశాయి. తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ నోట్ రూపకల్పన మొదలుపెట్టిన కేంద్ర హోంశాఖ.. ఆ నోట్‌కు సంబంధించిన ఒక కాపీని న్యాయశాఖకు పంపినట్లు సమాచారం. హైదరాబాద్‌కు కేంద్ర పాలిత ప్రాంతం హోదా వంటి ఊహాగానాలకు ఈ నోట్‌లో తెరదించినట్లు చెప్తున్నారు. ఢిల్లీలో టైమ్ వేస్ట్ చేసుకోవద్దు... ఇదిలావుంటే.. తెలంగాణ ఏర్పాటు జరిగి తీరుతుందని ఆంటోనీ కమిటీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు.. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, ఆర్థికమంత్రి పి.చిదంబరం, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌లు పార్టీ సీమాంధ్ర నేతలకు నిష్కర్షగా స్పష్టంచేశారు. గత రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో పాటు, సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు.. పదేపదే ఢిల్లీకి రావటం మానుకుని సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టిపెట్టాలని అధిష్టానం పెద్దలు నిర్దేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ‘ఈ అంశంపై సమయాన్ని, శక్తిని వృథా చేయవద్దని మేం వారికి చెప్పాం. తెలంగాణ ఏర్పాటు ఒక వాస్తవం. అధినేత్రి దీనిపై వెనక్కు వెళ్లటం జరగదు. రెండో విషయం.. నదీ జలాల పంపిణీ, విద్యుత్ అవసరాలు తదితర వివాదాస్పద అంశాలను పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తాయి. నిజానికి.. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ, న్యాయశాఖలకు నిర్దేశం చేయటం జరిగింది’ అని కాంగ్రెస్‌లో ఉన్నతస్థాయి వర్గాలు గురువారం వెల్లడించాయి. ‘యూటీ’ ప్రతిపాదన లేదు..! ‘ఆర్థికమంత్రి చిదంబరం ఇప్పటికే వివరించినట్లు.. హోంశాఖ నోట్‌లో మేం చేయబోయే మార్పుచేర్పుల్లో నదీ జలాల పంపిణీ, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, మూడు ప్రాంతాల్లో నివసించేవారందరి భద్రత, రక్షణ, పౌరులందరికీ ప్రాథమిక హక్కుల హామీ తదితర అంశాలు ఉంటాయి’ అని న్యాయశాఖలోని వర్గాలు తెలిపాయి. ‘నిజానికి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనకు మా పార్టీ సీమాంధ్ర నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రతిపాదన కేంద్ర హోంమంత్రి నుంచి వచ్చింది. దానిని ముందుకు తెస్తోంది హోంమంత్రి, ఆయన సలహాదారులు కొందరు మాత్రమే. అందరూ కాదు. దీనికి ఇతరులు వ్యతిరేకించటంతో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టేలా ఆయనను ఒప్పించాం’ అని ఆ వర్గాలు వివరించాయి. ఇదిలావుంటే.. విభజనపై కోర్టు జోక్యం కోసం ఉత్కంఠగా నిరీక్షిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకత్వానికి.. ఈ మార్గంలో ఏదైనా ఊరట లభిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. తెలంగాణ అంశంపై కేంద్రం వెనక్కు వెళ్లబోదని పూర్తిగా అవగతం చేసుకున్న సీమాంధ్ర నాయకత్వం.. ఇప్పుడిక కొత్త రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకు న్యాయపరమైన నిబంధనలు, రాజ్యాంగ అంశాలపై ఆధారపడుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement