రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు భగ్గుమనడంతో పాటు ఆందోళనలను తీవ్రతరం చేస్తుండటంతో ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టారు. రాజీనామా చేస్తే పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందనే భయం ఒకవైపు, చేయకపోతే కనీసం నియోజకవర్గాల్లోకి కూడా వెళ్లలేమనే భయం మరోవైపు వెంటాడుతున్న నేపథ్యంలో రాజీనామాల పేరుతో హైడ్రామాకు వారు తెర తీశారు. కొందరు ఎమ్మెల్యేలు తాము పీసీసీ అధ్యక్షునికి రాజీనామా లేఖలు పంపుతున్నట్టు ప్రకటించారు. మరికొందరేమో ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామా లేఖలు పంపినట్టు తెలిపారు. వారిలోనూ కొందరు స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా, ‘రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాం’ అని పేర్కొంటూ సుదీర్ఘ లేఖలను రూపొందించి స్పీకర్ కార్యాలయానికి పంపుతున్నట్టు ప్రకటించారు. ఆయా లేఖలను మీడియాకు కూడా ప్రదర్శించారు! తాను, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశామని గురువారం రాత్రి పొద్దుపోయాక గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. వాటిని సీఎంకు పంపినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన ఖాయమంటూ ఢిల్లీ నుంచి ముందే సంకేతాలున్నప్పటికీ ఇంతకాలం మిన్నకుండిపోయిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, విభజనపై నిర్ణయం వెలువడ్డ మూడు రోజుల తరవాత... రాయలసీమ, కోస్తా ప్రాంత ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ఉద్యమాల నేపథ్యంలో రాజీనామాల పర్వానికి తెరతీశారు. అయితే, పార్టీ పదవులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఈ నేతలు తెగేసి చెబుతున్నారు. ‘రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. మా పదవులకు వదులుకునేందుకు కూడా సిద్ధం’ అని మీడియా ముందు గట్టిగా చెబుతున్న నేతలు, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా గురువారం మధ్యాహ్నం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌హౌస్‌లో సమావేశమైన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తొలుత రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. 17 మంది మంత్రులు, 27 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలతో కలిపి మొత్తం 56 మంది ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని రాజీనామాలపై సుధీర్ఘంగా చర్చించారు. విభజనను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మెట్‌లో మూకుమ్మడిగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తామని భేటీ అనంతరం వారంతా ప్రకటించారు. కానీ సాయంంత్రానికే మాట మార్చి, ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టుగా వ్యవహరించారు. సీమాంధ్ర ప్రాంతంలో స్పీకర్ సహా మొత్తం 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నప్పటికీ వారిలో పట్టుమని పది మంది కూడా స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాకు ముందుకు రాలేదు!
Published Fri, Aug 2 2013 7:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement