పెద్ద నోట్ల రద్దు పరిణామాల కారణంగా రాష్ట్రానికి రూ.3,250 కోట్ల మేర నష్టం కలుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందులో వస్తు సేవలు, వాణిజ్య పన్నుల ఆదాయం రూ. 2,600 కోట్ల మేర తగ్గనుందని, రవాణా శాఖకు రూ. 450 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.200 కోట్ల వరకు కోత పడుతుందని నిర్ధారించింది. ఇక నోట్ల సమస్య కారణంగా సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారని తేల్చింది. ఈ అంశాలన్నింటినీ విశ్లేషిస్తూ రూపొందించిన ప్రత్యేక నివేదికను.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రధాని మోదీకి అందించనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రే ఢిల్లీకి వెళ్లారు.