జిల్లాలోని చెరకు రైతుల తిరుగుబాటు ఫలించింది. సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, మురళీలను పోలీసులు అరెస్ట్ చేశారు. బకాయిలు చెల్లించాలని చెరకు రైతులు వారం రోజులుగా రోడ్డు ఎక్కారు. నిన్న మండలంలోని రోడ్లను దిగ్బంధనం చేశారు. ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 11వేల మంది చెరకు రైతులకు 24 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవలసి ఉంది. ఇదుగో ఇస్తాం, అదుగో ఇస్తాం అని చెబుతూ యాజమాన్యం 18 సార్లు వాయిదా వేసింది. దాంతో రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. వారం రోజుల నుంచి ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారంలో రైతులు షుగర్ ఫ్యాక్టరీ లోపలకు చొచ్చుకుపోయారు. లోపల యంత్రాలను, అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలోని చెట్లను కూడా పెకలించివేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా తమను బాధలకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమసొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అప్పులు చేసి చెరకు పండించి ఫ్యాక్టరీకి సరఫరా చేశామని చెప్పారు. ఏడాదిన్నర నుంచి తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని వారు వాపోయారు. అధికారులు, పాలకులు కూడా తమను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో చెరకు రైతుల ఆందోళనపై పోలీసులు స్పందించారు. ఫ్యాక్టరీ ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు.
Published Sun, Sep 7 2014 2:39 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement