కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకు సంబంధించి నిజం పలికారు. వైఎస్ ప్రజానురంజకంగా పాలించి సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే, మడమ తిప్పని మహానాయకుడు వైఎస్ఆర్. ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయిన నేత ఆయన. సత్యాన్ని ఎవరూ దాచలేరు. దిగ్విజయ్ సింగ్ నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ వైఎస్ మరణం తరువాత రాష్ట్రంలో అశాంతి నెలకొందని బాధపడ్డారు. ఆయన లేకపోవడంతో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయన్నారు. అంతకు ముందున్న ప్రశాంత వాతావరణం పూర్తిగా కనుమరుగైందని చెప్పారు. 'ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికలకు ముందు బాగా పనిచేశారు. అనంతరం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి పార్టీని తిరిగి అధికారంలో నిలబెట్టారు. ఆయన ఉన్నంతకాలం రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ఆయన మరణం తర్వాత రాష్ట్రంలో అనేక రకాల ఉద్యమాలు జరిగి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ముఖ్యంగా వైఎస్ గతించిన తర్వాత తెలంగాణకు సంబంధించి ఉద్యమం లేదా ఆందోళనలు బాగా పెరిగాయి.' అన్నారు. దిగ్విజయ్ చెప్పిన విషయాలు అక్షర సత్యం. ఎవరూ కాదనలేని నిజం. వైఎస్ పరిపాలనా ప్రస్థానం రైతులకు ఉచిత విద్యుత్తో ప్రారంభమై కులమతాలతో సంబంధంలేకుండా ప్రతిపేద విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేవరకు అప్రతిహతంగా కొనసాగుతూ ఉన్న సమయంలో ఆయన దుర్మరణం చెందారు. జలయజ్ఞం - పేదలకు ఆరోగ్యశ్రీ - ఇందిరమ్మ ఇళ్లు - రాజీవ్ గృహకల్ప - రాజీవ్ స్వగృహ - వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పథకం - మహిళలకు పావలా వడ్డీ రుణాలు - 108 పథకం, పలు జిల్లాలలో విశ్వవిద్యాలయాలు, ఐఐటితోపాటు ట్రిపుల్ ఐటిల స్థాపన......ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఊహకందని ఆలోచనలతో గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అద్వితీయంగా అమలు చేశారు. ఆ విధంగా వైఎస్ పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఆయన అధికారంలో ఉండగా అడిగినవారికి కాదనకుండా అన్ని పనులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ... అందరి కోరికలు తీర్చారు. అందరూ అడిగి పనులు చేయించుకున్నవారేగానీ, ఉద్యమాలు చేసినవారులేరు. మావోయిస్టులతో కూడా చర్చలు జరిపిన ఘనత ఆయనకుంది. సుస్థిర పాలన అందించి రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని మహానాయకుడుయ్యారు వైఎస్. దిగ్విజయ్ సింగ్ చెప్పిన విధంగా వైస్ మరణం తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమ పథకాలు ఏవీ సక్రమంగా అమలు జరగడంలేదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. పరిపాలన అస్తవ్యస్థంగా తయారైంది.
Published Mon, Jul 1 2013 6:44 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement