కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడిగా భూమా నాగిరెడ్డి వ్యవహరిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల పరిశీలకురాలిగా శోభానాగిరెడ్డి ఉంటారని పత్రికలో పొరపాటున ప్రచురితమైందని ఆపార్టీ మంగళవారం ఓ ప్రకటన చేసింది. కాగా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకురాలిగా శోభానాగిరెడ్డి వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 3వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో 9 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను దాఖాలు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న నామినేషన్ల పరిశీలన, 15న అభ్యంతాల స్వీకరణ, 16న అభ్యంతరాలపై తుది విచారణ, 17వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు గడువు నిర్ణయించారు. జిల్లాలోని 883 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ఈ నెల 23న కర్నూలు డివిజన్‌లోని 299 గ్రామ పంచాయతీలు, 3212 వార్డులకు.. రెండో విడతలో 27న నంద్యాల డివిజన్‌లోని 287 గ్రామ పంచాయతీలు, 2916 వార్డులకు.. మూడో విడతలో 31వ తేదీన ఆదోని డివిజన్‌లోని 297 గ్రామ పంచాయతీలు, 3274 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.