నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వాన జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూడు రోజులుగా కరెంటు లేక.. తాగడానికి నీళ్లు లేక.. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీరు చేరడంతో బయటకు వెళ్లే దారిలేక.. ఆదుకునే వారు కనిపించక.. ఏ క్షణంలో ఏ ఉపద్రవం జరుగుతుందో తెలియక భయాందోళనలో మునిగిపోతున్నారు. నిండా నీటిలో మునిగిపోయిన భండారి లేఅవుట్, నిజాంపేట్‌ల నుంచి అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్, రామంతాపూర్‌ల దాకా చాలా కాలనీలు, బస్తీల ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు.