జగన్ ఆరోగ్యం నిలకడగా ఉంది | YS Jagan Mohan Reddy health condition is stable says niims doctors | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 4 2013 7:20 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. మంగళవారం ఉదయం వారు జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం గతంతో పోలిస్తే మెరుగైందని, బీపీ, సుగర్, సోడియం నిల్వలు సాధారణ స్థితికి చేరుకున్నాయని తెలిపారు. అయితే వారం రోజులపాటు దీక్ష చేసిన కారణంగా నరాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని, ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి వచ్చినప్పుడు సైతం కష్టంగా ఉందని పేర్కొన్నారు. హిమోగ్లోబిన్ (రక్తం) ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. పండ్లు, పండ్ల రసాలు, ఘన పదార్థాలు తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుదల వేగంగా ఉంటుందని ఆయన్ను పర్యవేక్షిస్తున్న వైద్య బృందం ‘సాక్షి’కి తెలిపింది. మునుపటి కంటే ఆయన కులాసాగా కనిపించినట్లు వైద్యులు తెలిపారు. రోజు మాదిరే మంగళవారం కూడా ఆయనకు ఫ్లూయిడ్స్ ఇచ్చామని, అయితే గత రెండ్రోజులుగా ఇస్తున్న మోతాదుకంటే తగ్గించినట్లు వివరించారు. అయితే ఉన్నట్టుండి సాయంత్రం కొద్దిగా పల్స్ రేటు తగ్గిందన్నారు. బుధవారం ఉదయం తిరిగి వైద్య పరీక్షలు చేసి ఇందుకు కారణాలను కనుక్కుంటామన్నారు. జగన్‌కు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అన్నీ సాధారణ స్థితికి వచ్చినట్లైతే డిశ్చార్జిపై ఆలోచిస్తామని చెప్పారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని నిర్ణయించిన అనంతరం జైలు అధికారులకు సమాచారం అందిస్తామని, ఆ తర్వాత డిశ్చార్జి అవుతారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్‌కు మంచి పోషకాహారం ఇవ్వాల్సిన అవసరముందని, దీనివల్ల మరింత త్వరగా కోలుకుంటారని వైద్యులు అభిప్రాయపడ్డారు. కొన్నిరకాల పండ్లను జగన్ ఆహారంగా తీసుకున్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కువసేపు ఆంగ్ల పుస్తకాలు చదువుతూ కనిపించారని ఆయన్ను పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జగన్ వద్ద ఆయన సతీమణి వైఎస్ భారతి ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement