వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. సురేఖ వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని వైఎస్సార్సీపీ నేత బాజిరెడ్డి గోవర్దన్ సోమవారమిక్కడ అన్నారు. జగన్‌పై గతంలో చంద్రబాబు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ ఆరోపణ చేసినప్పుడు సురేఖ ఏవిధంగా తిప్పికొట్టారో ఓసారి మననం చేసుకోవాలని బాజిరెడ్డి సూచించారు. వైఎస్‌ఆర్ కుటుంబానికి కష్టాల్లో అండగా ఉండాలే తప్ప అభాండాలు వేయొద్దని హితవు పలికారు. ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ విషయంలో యూటర్న్ తీసుకున్నారని అనడం సరికాదన్నారు. రాష్ట్ర పరిస్థితులపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగానే 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని బాజిరెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ తీరుపై కొండా సురేఖ విరుచుకుపడ్డారు. ఈ మేరకు వరంగల్‌లో బహిరంగ లేఖ విడుదల చేసిన సురేఖ... తెలంగాణ అంశంపై పార్టీ పరంగా మరింత స్పష్టత ఇవ్వాలని కోరారు.