ఓ పనైపోయింది! | India's victory in the second ODI | Sakshi
Sakshi News home page

Jul 13 2015 10:41 AM | Updated on Mar 21 2024 8:30 PM

హరారే : జింబాబ్వేపై సిరీస్ గెలవడానికి భారత్‌కు ద్వితీయ శ్రేణి జట్టు సరిపోయింది. రెండో వన్డేలోనే సిరీస్ గెలిచి రహానే సేన ఓ పని పూర్తి చేసింది. మురళీ విజయ్ (95 బంతుల్లో 72; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ రహానే (83 బంతుల్లో 63; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 62 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. టాస్ గెలిచి ఆతిథ్య జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో రాయుడు (50 బంతుల్లో 41; 3 ఫోర్లు) ఫామ్‌ను కొనసాగించగా, మనోజ్ తివారీ (26 బంతుల్లో 22; 1 సిక్స్), స్టువర్ట్ బిన్నీ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు) మోస్తరుగా ఆడారు. విజయ్, రహానే తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత నిలకడగా ఆడిన రాయుడు... విజయ్‌తో కలిసి రెండో వికెట్‌కు 47; తివారీతో కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. చివర్లో బిన్నీ, జాదవ్ (16) ఆరో వికెట్‌కు 17 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో ప్రత్యర్థి ముందు భారత్ మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. మద్జీవా 4 వికెట్లు తీశాడు. తర్వాత జింబాబ్వే 49 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటై ఓడింది. చిబాబా (100 బంతుల్లో 72; 9 ఫోర్లు) టాప్ స్కోరర్. ముత్తుబామి (32), క్రెమెర్ (27), సీన్ విలియమ్స్ (20)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వేకు సరైన ఆరంభం లభించలేదు. విలియమ్స్‌తో నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించిన చిబాబా... రజా (18)తో ఐదో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఓ దశలో ఆతిథ్య జట్టు 132 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అయితే ముత్తుబామి, క్రెమెర్‌లు ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించినా... రన్‌రేట్ పెరిగిపోవడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. భువనేశ్వర్ 4 వికెట్లు తీశాడు. మురళీ విజయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే మంగళవారం జరుగుతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement