Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Perni Nani sensational comments on phone tapping in Andhra Pradesh1
చంద్రబాబు బంధువే ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రదారి: పేర్నినాని

సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్‌ అయ్యారు.ములాఖత్‌ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్‌ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్‌ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువే ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రదారి చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారు. ఫోన్‌ ట్యాప్‌ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులువల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు. నాపైనా కేసులు సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.

Telangana Government Orders Vigilance Inquiry Into Secretariat Construction2
తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంతంటే?.. ప్రభుత్వానికి విజిలెన్స్‌ నివేదిక

హైదరాబాద్‌ : సచివాలయ నిర్మాణం, వ్యయం అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం వింగ్‌ల వారిగా విచారణ మొదలుపెట్టింది. అయితే, ఈ విచారణలో సచివాలయం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ విభాగంపై విజిలెన్స్‌ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికలో సెక్రటేరియట్‌లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్‌వేర్‌, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ. 320కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది.బిల్లులు మంజూరు చేయకుండానే నిధులను విడుదల చేసినట్లు గుర్తించింది. రూ. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పటివరకు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వం సదరు సంస్థకు నిధులను విడుదల చేసింది. మొత్తం అంచనా రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని విజిలెన్స్‌ తాత్కాలిక రిపోర్టులో పేర్కొంది.

Google Pay Begins Charging for Bill Payments Check The Details Here3
గూగుల్‌ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!

స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది.. దాదాపు అన్ని లావాదేవీలకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. యూజర్ల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న సమయంలో.. ట్రాన్సాక్షన్ల మీద ఛార్జీలను వసూలు చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు లావాదేవీల మీద ఎలాంటి ఛార్జీలను వసూలు చేయని గూగుల్ పే.. ఇకపై ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, డీటీహెచ్ బిల్స్ చెల్లించినప్పుడు.. అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే వినియోగదారులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదు.గతేడాది నుంచి మొబైల్ రీఛార్జీల మీద రూ. 3 కన్వీనియన్స్‌ ఫీజును వసూలు చేస్తున్న గూగుల్‌ పే.. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బిల్స్ మీద 0.5 శాతం నుంచి 1 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి బిల్స్ చెల్లించిన యూజర్లకు ఇప్పటికే ఛార్జీలు పడినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పులుఅదనపు ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా అందరూ ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే?.. దీనిపై గూగుల్‌ పే స్పందించలేదు. అయితే గూగుల్ పే దీనిని అమలు చేస్తే.. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

Haris Raufs Bold Statement Before IND vs PAK Clash4
భార‌త్‌తో మ్యాచ్‌.. మాకు స్పెషలేమి కాదు: పాక్‌ స్టార్‌ బౌలర్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో అస‌లు సిసిలైన పోరుకు స‌మ‌యం అస‌న్న‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 23న దుబాయ్ వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్దులు భారత్‌-పాకిస్తాన్(India-Pakistan) అమీతెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్‌ల‌లో పాక్‌పై త‌మ అధిప‌త్యాన్ని కొన‌సాగించాల‌ని భార‌త్ భావిస్తోంది. మ‌రోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్‌ ఫ‌లితాన్ని పున‌రావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో జరిగే మ్యాచ్ ‍గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని రౌఫ్ తెలిపాడు."భారత్‌తో మ్యాచ్ సందర్బంగా మాపై ఎలాంటి ఒత్తడి లేడు. ఆటగాళ్లందరూ రిలాక్స్‌గా ఉన్నారు. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే. పాకిస్తాన్-భారత్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్‌లనే జరుగుతుంది" అని జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రౌఫ్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా టోర్నీని భారత్‌ అద్భుతమైన విజయంతో ఆరంభించింది. గురువారం దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. పాక్‌ మాత్రం కివీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.తుది జ‌ట్లు(అంచనా)భారత్‌: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్‌: ఇమామ్ ఉల్ హ‌క్‌, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్‌), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: IPL 2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్‌..

APERC gets clean chit on deal with Solar Energy Corporation of India Limited5
‘సెకీ’ ఒప్పందం సక్రమమే

సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్‌ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎస్‌ఏపై ఏపీఈఆర్‌సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాలు, సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కమిషన్‌ (సీఈఆర్‌సీ) జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెన్‌ (జీఎన్‌ఏ) నిబంధనలు, పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌(పీపీఏ) ప్రకారం..‘సెకీ’ విద్యుత్‌కు అంతర్‌ రాష్ట్ర ప్రసార (ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌–ఐఎస్‌టీఎస్‌) చార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది.సెకీ విద్యుత్‌ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్‌ సేకరణ ప్రణాళిక (పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాన్‌)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు. – ఏపీఈఆర్‌సీసాక్షి, అమరావతి: రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్‌ రెవిన్యూ రిక్వైర్‌మెంట్‌–ఏఆర్‌ఆర్‌)లో ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. విద్యుత్‌ సేకరణపై తాజాగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్‌) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్‌ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్‌ ‘సెకీ’ విద్యుత్‌ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. ‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్‌ సేకరణ ప్రణాళిక (పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాన్‌)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్‌సీ పేర్కొంది. ఇక సెకీ నుంచి విద్యుత్‌ సేకరణ ప్రణాళికలో ట్రేడింగ్‌ మార్జిన్‌ తగ్గించడంపై జరిగిన చర్చలను కూడా మండలి ప్రస్తావించింది. సీఈఆర్‌సీ రూ.0.7 పైసల ట్రేడింగ్‌ మార్జిన్‌తో టారిఫ్‌ను ఇప్పటికే ఆమోదించిందని, అందువల్ల దానిపై కమిషన్‌ దీనిపై ఇప్పుడు వ్యాఖ్యానించదని తెలిపింది. అంటే గత ప్రభుత్వం కుదుర్చుకున్న ధర యూనిట్‌ రూ.2.49కే సెకీ నుంచి విద్యుత్‌ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో సెకీ లాంటి పీఎస్‌ఏ ఒప్పందాలను కొందరు డిమాండ్‌ చేస్తున్నట్లుగా సూమోటోగా కమిషన్‌ రద్దు చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరులో విద్యుత్‌ సేకరణకు డిస్కంలు కోరిన ప్రణాళికలో సెకీ విద్యుత్‌ను చేర్చడానికి కమిషన్‌ మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్‌ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని.. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని.. పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనే.. ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సిందే.. జుగల్‌ బందీలు.. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం.. ఇలా చిలువలు పలువలుగా.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఎల్లో మీడియా, టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని దీన్నిబట్టి తేలిపోయింది. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా బరితెగించినట్లు వెల్లడైంది. అంటే తప్పులేదని ఒప్పుకున్నట్లేగాఅంతరాష్ట్ర విద్యుత్‌ సరఫరా చార్జీలను (ఐఎస్‌టీఎస్‌) మినహాయించి యూనిట్‌ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్‌ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్‌ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్‌ 11న ఏపీఈఆర్‌సీ కూడా ఆమోదించింది. 2003 విద్యుత్‌ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చింది. నిజానికి సెకీ నుంచి గతేడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్‌ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది. తొలి ఏడాది 2024లో 3వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం 7వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుందని ఒప్పందంలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం 4వేల మెగా­వాట్లను ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్లూ తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లైంది!సంపద సృష్టించిందెవరు?.. గుదిబండ మోపిందెవరు?సెకీ నుంచి కారుచౌకగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ద్వారా గత ప్రభుత్వం ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది. అదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్‌ యూనిట్‌ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్‌ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్‌ జగన్‌ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా? చేసిన మంచిని దాచలేరు.. గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని చక్కదిద్దేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్‌ సరఫరా అందించింది. అందుకుగానూ డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. దానిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండు లక్షలపైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసింది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి సాగుకు చేదోడు వాదోడుగా నిలిచింది. రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్‌ సరఫరా చేసేలా 6,663 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. విద్యుత్‌ రంగానికి, రైతన్నలకు ఇంత మంచి చేసిన వైఎస్‌ జగన్‌పై బురద చల్లుతూ సెకీ విద్యుత్‌ ధర ఎక్కువని, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సి వస్తుందని కూటమి నేతలు, కరపత్రికలు దు్రష్పచారం చేశాయి. చివరికి అవన్నీ తప్పుడు ఆరోపణలని విద్యుత్‌ నియంత్రణ మండలి తేల్చింది. ఇప్పుడేమంటారు బాబూ..?కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం, విద్యుత్‌ పంపిణీ సంస్థల మధ్య త్రైపాక్షిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మంత్రి మండలితో పాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే జరిగింది. సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. దాన్ని రైతుల వ్యవసాయ అవసరాల కోసం అందించాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పించింది. ఆ ధర అప్పటికి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ఈ ఒప్పందంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం, టీడీపీ అనుబంధ కరపత్రిక ఈనాడు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశాయి.అదానీపై అమెరికాలో ఏదో కేసు నమోదైందని, అందులో జగన్‌ పేరు ఉందని, లంచం తీసుకున్నారని నిరాధార కథనాలను వండి వార్చాయి. ఈనాడు, టీడీపీ అనుబంధ మీడియా రాసిన అసత్య కథనాలను పట్టుకుని చంద్రబాబు ప్రోద్బలంతో కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఊగిపోయారు. ఏకంగా జగన్‌పైనే కేసు పెట్టినట్లు నిందలేస్తూ ఆరోపణలు గుప్పించారు. సెకీ ఒప్పందానికి అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు రాదని, యూనిట్‌ రూ.2.49 కూడా ఎక్కువేనని, ప్రజలపై పాతికేళ్లలో రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఏమార్చేందుకు టీడీపీ కరపత్రికలు యత్నించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఇదే చంద్రబాబు గతంలో అత్యధిక ధరలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పడు మార్కెట్‌లో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.44కే లభిస్తున్నా ఏకంగా యూనిట్‌ రూ.6.99 చొప్పున కొన్నారు. మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారు. తాజాగా ఏపీఈఆర్‌సీ ఇచ్చిన స్పష్టత వాటికి చెంపపెట్టులా పరిణమించింది.ఎల్లో కరపత్రం.. ఎంత విషం చిమ్మిందో.. ఆరోపణ: సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణనిజం: సెకీ లేఖ – ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం. కమిటీ లోతైన అధ్యయనం తరువాతే కేబినెట్‌ ఆమోదంఆరోపణ: ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు నిజం: పాతికేళ్ల పాటు అంతరాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ’సెకీ’ఆరోపణ: సోలార్‌ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్ధిక భారం పడుతుంది.నిజం: ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. ఒప్పందం జరిగింది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కమ్‌ల మధ్య! ఇక లంచాలకు తావెక్కడ?రాష్ట్ర చరిత్రలోనే కారుచౌకరాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్‌ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్‌ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు ఇక లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? నేరుగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది?‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..» కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) యూనిట్‌ రూ.2.49కే సోలార్‌ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్‌ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.» ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. » ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్‌ పవర్‌ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్‌ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది. » రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. » ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?» టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందంæ జరిగితే.. యూనిట్‌ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్‌ దొరుకుతుంటే.. పైగా స్పెషల్‌ ఇన్సెంటివ్‌గా అంతరాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్‌ మోడల్‌ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్‌ ప్యాకేజ్‌ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లకు సెకీ ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్‌ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్‌ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సింది పోయి బురద జల్లుతారా? మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్‌ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబును మోయాలన్న తాపత్రయంతో... జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?. – ఎల్లో మీడియా దుష్ప్రచార కథనాలపై గతంలో వైఎస్‌ జగన్‌ వ్యాఖ్య

Telangana CM Revanth Reddy Lay Foundation Stone For Indiramma Houses6
దమ్ముంటేరండి!

2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చకు సిద్ధమా? అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా నాతో చర్చకు రావాలి. మీ బంట్లు, బంట్రోతులను ఎవరిని పంపుతారో తేల్చుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. వచ్చే సర్పంచ్‌ ఎన్నికల్లో.. ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) ఉన్న గ్రామాల్లో మేం పోటీ చేస్తాం, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బీఆర్‌ఎస్‌ పోటీ చేయాలి. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?సాక్షి, నాగర్‌కర్నూల్‌/ నారాయణపేట: దేశంలో 12 ఏళ్ల మోదీ పాలన, రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్‌ పాలన.. 12 నెలల కాంగ్రెస్‌ పాలనపై తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్‌ విసిరారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఎవరు వస్తారో, ఎక్కడికి వస్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో డిపాజిట్‌ గల్లంతు అయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో ఉందని సీఎం విమర్శించారు.శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్‌ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మెడికల్‌ కళాశాల, నర్సింగ్, పారామెడికల్‌ కళాశాలలకు ప్రారంబోత్సవం చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పెట్రోల్‌ బంక్‌ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్‌ మాట్లాడారు.సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఎన్నో పనులు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎప్పుడో బ్రిటిష్‌ కాలమైన 1931లో చేసిన కులగణన తప్ప ఈనాటికీ ఎవరూ లెక్క చెప్పలేదు. బీసీలు చైతన్యం అవుతున్నారు. తమ లెక్క చెప్పాలని అంటున్నారు. దేశంలో మొదటిసారి ప్రతి కులం లెక్క తీసేందుకు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచాం. 30ఏళ్లుగా పీటముడి పడిన ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపాం.ఏడాదిలోనే సాధించిన ఈ విజయాలు కేసీఆర్‌ కళ్లకు కనబడటం లేదా? ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు కాకముందే దిగిపోవాలని చూస్తున్నారు. కళ్లలో నిప్పులు, కడుపులో కత్తులు పెట్టుకొని మన మధ్యనే పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. తాను కొడితే గట్టిగా వేరేలా ఉంటుందని కేసీఆర్‌ అంటున్నారు. ఆయన కొట్టాల్సి వస్తే ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీలు చేసిన కొడుకును, ఢిల్లీలో లిక్కర్‌ దందా చేసిన బిడ్డను, కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు మింగిన అల్లుడిని కొడితే వాళ్లకు బుద్ధి వస్తుంది. కేసీఆర్‌ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు.. పాలమూరు నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినా ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన పాపం బీఆర్‌ఎస్‌దే. అప్పుడే పూర్తిచేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ ఎందుకు వచ్చేది? పోతిరెడ్డిపాడు ద్వారా జగన్‌ ఏపీకి 40వేల క్యూసెక్కులు తరలించుకుపోతుంటే కేసీఆర్‌ ఊడిగం చేశారు. ఆనాడు మంత్రిగా ఉన్నది హరీశ్‌రావు కాదా? జగన్‌తో కలసి ప్రగతిభవన్‌లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పన్నింది ద్రోహం కాదా? రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీల చొప్పున నెల రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది. మహిళలకు ఏడాదికి రెండు చీరలు.. దేశంలోనే మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు ప్రారంభించాం. ఇందిరా మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళల చేతికి పర్యవేక్షణ, మహిళా సమాఖ్యల ఆధ్యర్యంలో 600 బస్సుల కొనుగోలు, పావలా– జీరో వడ్డీ రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని మహిళా సంఘాల మహిళలకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు అందిస్తాం. పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చే బాధ్యత నాది.ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపుతాం’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం కల: మంత్రులు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కలగానే మిగులుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని అలాంటిది ఏడాది పాలనలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పారు. రాష్ట్రంలో కులగణనతోపాటు ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపి చరిత్రలో నిలిచామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సామాజిక న్యాయం అందిస్తూ అసమానతలను తొలగిస్తామన్నారు. నిన్నేం అంటలేను అక్కా.. – సీఎం రేవంత్, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద మహిళా సమాఖ్య ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకు ప్రారంబోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఒకచోటుకు చేర్చి, మహిళా శక్తిని చాటుతూ నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామని సీఎం రేవంత్‌ పేర్కొనగా.. ఎంపీ డీకే అరుణ కలుగజేసుకుని కేంద్రం ఇప్పటికే నిధులను ఇస్తోందని చెప్పారు.దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘కేంద్రం ఇస్తుంది. ఇవ్వాలి. మిమ్మల్ని ఏమీ అనడం లేదు అక్కా. ప్రజలకు సేవ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మీకు ఇక్కడ తల్లి గారిల్లు, అక్కడ అత్త గారిల్లు, పిల్లల కోసం ఎవరేం ఇచ్చినా వద్దు అనలేం. అవసరమైనప్పుడు అందరం ఒక్క తాటిపై నిలబడాలి..’’ అని పేర్కొన్నారు.

South Africa beat Afghanistan by 107 runs7
అదరగొట్టిన దక్షిణాఫ్రికా

కరాచీ: సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ టైటిల్‌ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న దక్షిణాఫ్రికా చాంపియన్స్‌ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టింది. తొలిసారి టోర్నీ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా తమ స్థాయికి తగ్గ ఆటతో పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో చెలరేగిన మాజీ చాంపియన్‌ ఆ తర్వాత పదునైన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ర్యాన్‌ రికెల్టన్‌ (106 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ బవుమా (76 బంతుల్లో 58; 5 ఫోర్లు), మార్క్‌రమ్‌ (36 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), డసెన్‌ (46 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం అఫ్గానిస్తాన్‌ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్‌ షా (92 బంతుల్లో 90; 9 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. మూడు అర్ధ సెంచరీలు... ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే టోనీ జోర్జి (11) వెనుదిరగ్గా ... రికెల్టన్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రికెల్టన్‌ 48 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు అఫ్గాన్‌ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 63 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్న అనంతరం నబీ బౌలింగ్‌లో బవుమా వెనుదిరిగాడు. రికెల్టన్, బవుమా రెండో వికెట్‌కు 23.4 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 101 బంతుల్లో రికెల్టన్‌ కెరీర్‌లో తొలి శతకాన్ని సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే అతను అనూహ్యంగా రనౌటయ్యాడు. కీలక వికెట్‌ తీసిన ఆనందం అఫ్గాన్‌కు దక్కలేదు. ఆపై డసెన్, మార్క్‌రమ్‌ తమ జోరును ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 దాటింది. రహ్మత్‌ షా మినహా... భారీ ఛేదనలో అఫ్గాన్‌ టీమ్‌ తడబడింది. రహ్మత్‌ షా పట్టుదలగా నిలబడినా... ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. నలుగురు సఫారీ పేసర్ల ధాటికి బ్యాటర్లు నిలవలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికే తొలి 2 వికెట్లు కోల్పోయిన జట్టు తర్వాతి 5 ఓవర్లలో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 89/5 స్కోరు వద్ద జట్టు గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. రహ్మత్‌ మాత్రం కాస్త పోరాడుతూ సెంచరీకి చేరువయ్యాడు. అయితే మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (రనౌట్‌) 103; టోనీ జోర్జి (సి) అజ్మతుల్లా (బి) నబీ 11; బవుమా (సి) సాదిఖుల్లా (బి) నబీ 58; డసెన్‌ (సి) హష్మతుల్లా (బి) నూర్‌ 52; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 52; మిల్లర్‌ (సి) రహ్మత్‌ (బి) ఫారుఖీ 14; యాన్సెన్‌ (బి) అజ్మతుల్లా 0; ముల్డర్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 315. వికెట్ల పతనం: 1–28, 2–157, 3–201, 4–248, 5–298, 6–299. బౌలింగ్‌: ఫారుఖీ 8–0–59–1, అజ్మతుల్లా 6–0–39–1, నబీ 10–0– 51–2, రషీద్‌ ఖాన్‌ 10–0–59–0, గుల్బదిన్‌ 7–0–42–0, నూర్‌ అహ్మద్‌ 9–0–65–1. అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) మహరాజ్‌ (బి) ఎన్‌గిడి 10; ఇబ్రహీమ్‌ (బి) రబడ 17; సాదిఖుల్లా (రనౌట్‌) 16; రహ్మత్‌ షా (సి) రికెల్టన్‌ (బి) రబడ 90; హష్మతుల్లా (సి) బవుమా (బి) ముల్డర్‌ 0; అజ్మతుల్లా (సి) రికెల్టన్‌ (బి) రబడ 18; నబీ (సి) రబడ (బి) యాన్సెన్‌ 8; గుల్బదిన్‌ (సి) బవుమా (బి) ఎన్‌గిడి 13; రషీద్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) మహరాజ్‌ 18; నూర్‌ (బి) ముల్డర్‌ 9; ఫారుఖీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ ట్రాలు 9; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్‌) 208. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–50, 4–50, 5–89, 6–120, 7–142, 8–169, 9– 208, 10–208. బౌలింగ్‌: యాన్సెన్‌ 8–1– 32– 1, ఎన్‌గిడి 8–0–56–2,రబడ 8.3–1–36–3, ముల్డర్‌ 9–0–36–2, మహరాజ్‌ 10–0–46–1. చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు ఆ్రస్టేలియా X ఇంగ్లండ్‌వేదిక: లాహోర్‌ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, స్పోర్ట్స్‌ 18, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Rajasthan MP Hanuman Beniwal on agricultural loans8
రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం

బ్యాంకులు ప్రదర్శిస్తున్న ఈ అసమానత వింత గొలుపుతుంది. ఒక ఆర్టీఐ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, 2014 ఏప్రిల్‌ 1 నుండి కార్పొరేట్‌ ఇండియాకు సంబంధించి రూ. 16.61 లక్షల కోట్ల మొండి రుణాలనుబ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలియజేసింది. మరుసటి రోజు రాజస్థాన్‌ ఎంపీ హనుమాన్‌ బేనీవాల్‌ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పుడు రూ. 32 లక్షల కోట్లు దాటాయని అన్నారు. 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ అని బేనీ వాల్‌ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణ మాఫీ పథకం గురించి బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.కార్పొరేట్లకు రుణమాఫీదీనికి విరుద్ధంగా, గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్లు చేసిన మొత్తం రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) రద్దు చేశారు. గత ఐదేళ్లలో కార్పొరేట్లు చెల్లించని రుణా లలో రూ. 10.6 లక్షల కోట్లను రద్దు చేయడానికి భారతీయబ్యాంకులు ఏమాత్రం సందేహించలేదు. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. అదే కర్ణాటక, శివమొగ్గలోని ఒక రైతు కేవలం తన రూ. 3.46 పైసల బకాయి చెల్లించేందుకు సాధారణ బస్సు సర్వీస్‌ లేకపోతే, 15 కిలో మీటర్లు నడిచివెళ్లాల్సినంతటి ఆత్రుతను బ్యాంక్‌ ప్రదర్శించింది.2023–24 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 1.7 లక్షల కోట్లు మాఫీ చేశాయి. ఒక సంవత్సరం క్రితం, 2022–23లో రూ. 2.08 లక్షల కోట్లు మాఫీ చేశాయి. కానీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసే విషయానికి వస్తే, కేంద్రం రెండుసార్లు మాత్రమే ఆ పని చేసింది: 1990, 2008లో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యవ సాయ రుణాల మాఫీ చేశాయి. కానీ మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకు లకు రాష్ట్రాలు చెల్లిస్తున్నందున అది బ్యాంకులపై భారం కాదు. కార్పొ రేట్లు చెల్లించని బ్యాంకు రుణాలను అవి దేశ నిర్మాణానికి తోడ్ప డ్డాయనేంత జాగ్రత్తగా మాఫీ చేశారు. చిన్న రుణాలు మాఫీ చేయలేమా?పేద రైతులు, గ్రామీణ శ్రామికవర్గం చేసిన చిన్న చిన్న రుణా లను మాఫీ చేయడం అనేది జాతీయ బ్యాలెన్స్ షీట్‌ను కలవర పెట్టడానికి కారణంగా కనిపిస్తుంది. అదే ధనవంతులైన రుణమాఫీ దారులు సులభంగా తప్పించుకుంటారు. వీరిలో రూ.3.45 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించని 16,000 మందికి పైగా ఉద్దేశ పూర్వక రుణమాఫీదారులు ఉన్నారు. పైగా వారివద్ద డబ్బు ఉందని ఆర్బీఐ అంగీకరించినప్పటికీ వారు తిరిగి చెల్లించడానికి ఇష్టపడలేదు. కచ్చితంగా, వీరు సంపద సృష్టికర్తలు. దేశం వారిని అభినందించాలన్నమాట!ఇప్పుడు రాజస్థాన్‌లోని పీలీబంగాకు చెందిన ఒక రైతును చూడండి: ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 2.70 లక్షల రుణం తీసుకొని రూ. 2.57 లక్షలను తిరిగి చెల్లించాడు (మహమ్మారి సమయంలో రాష్ట్రం నుండి అందుకున్న రూ. 57,000 మద్దతుతో సహా). మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఆయన ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత, ఆగ్రహించిన గ్రామస్థులు ఆ తాళం పగలగొట్టారు.ఈ దురదృష్టకర సంఘటనను మరొకదానితో పోల్చి చూద్దాం. ప్రముఖ మిశ్రమ లోహ, ఉక్కు తయారీదారు అయిన ‘ఆధునిక్‌ మెటాలిక్స్‌’... 2018 జూలైలో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కోల్‌కతా శాఖ తన పరిష్కార ప్రణాళికను ఆమోదించిన తర్వాత, తమ బకాయిలు రూ. 5,370 కోట్లకుగానూ కేవలం రూ. 410 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంటే 92 శాతం రుణమాఫీ! స్పష్టంగా, ఇంత పెద్ద ‘రుణమాఫీ’ తర్వాత, కంపెనీ ప్రమోటర్లు అన్ని కార్యకలాపాలను పూర్తి చేయడానికీ, ప్రధానసంస్థను పునరుద్ధరించి తిరిగి పని చేయడం ప్రారంభించడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు పరివర్తనాత్మక పరిష్కార యంత్రాంగంగా ప్రశంసలందుకున్న దివాళా కోడ్‌ ఇప్పుడు ఒక వైఫల్యంగా మారిపోయింది.అయితే, పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ. 20,000 మొత్తాన్ని తిరిగి పొందలేకపోయినందుకు రాజస్థాన్‌ రైతు ఇంటికి తాళం వేయగలిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 92 శాతం మాఫీ చేసి రాజమార్గాన పంపడానికి బదులుగా, ఆధునిక్‌ మెటాలిక్స్‌ వంటి సంస్థల ప్రాంగణాన్ని ఎన్సీఎల్‌టీ ఎందుకు తాళం వేయలేకపోయింది? రైతుల వంటి వారే అయిన ఆ యజమానులను ఎందుకు కటకటాల వెనుక ఉంచలేకపోయింది?చట్టాల్లో ఎందుకు తేడా?ఒక పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, రైతులు ఇలాంటి విధానంతో ప్రయోజనాన్ని, అది కూడా సాపేక్షంగా తక్కువ అయినాసరే ఎందుకు పొందకూడదు? వివిధ వర్గాల బ్యాంకు వినియోగదారులకు బ్యాంకింగ్‌ చట్టాలు ఎందుకు భిన్నంగాఉండాలి? గృహనిర్మాణం, కారు, ట్రాక్టర్‌ లేదా మోటార్‌ సైకిల్‌ రుణాలు తీసుకునే వారిని బ్యాంకులు ఎప్పుడైనా అదే రకమైన సున్ని తత్వంతో చూస్తాయా? ఆర్థిక వృద్ధి పేరుతో కంపెనీల మొండి బకాయిలను మాఫీ రూపంలో తమ సొంతం చేసుకోవాల్సిన అగత్యాన్ని బ్యాంకులు ఎంతకాలం సమర్థించుకోగలవు?పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో నిటారుగా నిలబడి ఉన్న తమ కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను తిరిగి దున్నడానికి ట్రాక్టర్లను నడుపుతున్న రైతుల బాధాకరమైన వీడియోలను; ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్‌లలో టమోటా ధరలు పతనమై రైతులు కుప్పగూలిపోవడాన్ని నేను సోషల్‌ మీడియాలో చూసినప్పుడు తీవ్రంగా బాధపడ్డాను. టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంపల ధరలను స్థిరీకరించడానికి రూ. 500 కోట్ల వ్యయంతో 2018–19 బడ్జెట్‌లో ప్రారంభించిన ఆపరేషన్‌ గ్రీన్స్ పథకం నాకు ఇలాంటి సందర్భాల్లో గుర్తుకువస్తుంది. కోల్డ్‌ చైన్స్ నెట్‌వర్క్‌తో సహా వ్యవసాయ మౌలిక సదుపా యాలలో తగినంత పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవికత ఏమిటంటే, కూరగాయల ధరలను స్థిరీకరించడంలో ఆపరేషన్‌ గ్రీన్స్‌ పథకం ఘోరంగా విఫలమైంది. తగిన నిధుల మద్దతు లేకపోవడం ఒక కారణం కావచ్చు.రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఐఎల్‌) దివాళా తీసిన తీర్మానాన్ని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) 2023 డిసెంబర్‌లో ఆమోదించింది. ఈ సంస్థ క్లెయిమ్‌ చేసిన రుణంలో 99 శాతాన్ని మాఫీ చేయడం జరిగింది. చూడండి విచిత్రం: 2018–19లో ఆపరేషన్‌ గ్రీన్స్ కోసం కేటాయించిన రూ. 500 కోట్లతో పోలిస్తే, ఆర్‌సీఐఎల్‌ రూ. 47,251.34 కోట్ల క్లెయిమ్‌కు బదులుగా కేవలం రూ. 455.92 కోట్లు చెల్లించి బయటపడింది. మాఫీ చేసిన ఆ మొత్తాన్ని తిరిగి పొంది ఆపరేషన్‌ గ్రీన్స్ లో పెట్టుబడి పెడితే, పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక వనరుల కొరత ఏమాత్రం ఉండేది కాదు.- దేశంలో 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ.- గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్ల రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలవి.- ఒక పెద్ద కంపెనీకి పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, ఒక చిన్న రైతు అలాంటి ప్రయోజనం ఎందుకు పొంద కూడదు?- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు , ఈ–మెయిల్‌: hunger55@gmail.com- దేవీందర్‌ శర్మ

Supreme Court verdict on remission prison sentence9
ఖైదీలపై ఇంత వివక్షా!

జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్‌) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం. ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) అమల్లోకొచ్చింది. సీఆర్‌పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్‌ఎస్‌ఎస్‌లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 432 అధికారం ఇవ్వగా... బీఎన్‌ఎస్‌ఎస్‌లోని 473వ సెక్షన్‌ ఆ పని చేస్తోంది. చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు. పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది. చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది. అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్‌ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి.

Motilal Oswal talks on silver prices reach Rs 1,25,000 per kilogram in India10
ఇక వెండి.. కొండ! 

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి రేట్లకు దీటుగా పరుగులు తీసేందుకు వెండి కూడా సన్నద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఖరీదైన బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తుండటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన డిమాండ్‌ పెరుగుతుండటం కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. బంగారం, వెండి మధ్య కీలక నిష్పత్తుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు దీన్ని సూచిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాది వ్యవధిలో వెండి రేటు కేజీకి రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి మించి వెండి అధిక రాబడులు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) వైపు చూసే ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. నిష్పత్తి చెబుతోందిదే.. బంగారంతో పోలిస్తే వెండి ధర ఎంత చౌకగా ఉంది, లేదా ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి రెండింటి రేట్ల మధ్య నిర్దిష్టంగా ఉండే నిష్పత్తి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ఆల్‌టైమ్‌ కనిష్టం అయిన 0.01 స్థాయిలో ఉంది. ఈ నిష్పత్తి ఆల్‌టైం గరిష్టం 0.06 స్థాయి. సాధారణంగా సగటున ఒక్క ఔన్సు (31.1) గ్రాముల బంగారం విలువ, 60 నుంచి 70 ఔన్సుల వెండి విలువకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్క ఔన్సు బంగారం కొనాలంటే 90 ఔన్సుల వెండి అవసరమవుతోంది. ఈ వ్యత్యాసం సగటు స్థాయికి తగ్గాలంటే వెండి మరింతగా పెరగాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో పసిడి భారీగా ఎగిసిన నేపథ్యంలో స్వల్పకాలానికి వెండిని కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటుందనే భావన ఇన్వెస్టర్లలో నెలకొంది. గత మూడేళ్లుగా రాబడుల విషయంలో పసిడితో పోలిస్తే వెండి వెనకబడింది. డాలరు మారకంలో పసిడిపై రాబడులు సుమారు 54 శాతంగా ఉండగా, వెండిపై రాబడులు 37 శాతమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి రేటు 11.77 శాతం పెరగ్గా, వెండి రేట్లు 13.3 శాతం పెరిగాయి. 3,200 డాలర్ల దిశగా పసిడి!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం భారీగా ఎగియొచ్చన్న అంచనాలు పసిడి ర్యాలీకి దోహదపడుతున్నాయి. సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ. 2,948 డాలర్లకు పెరిగింది. ఇది ఈ ఏడాది ఏకంగా 3,200 డాలర్లకు ఎగియొచ్చనే పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుత స్థాయి నుంచి మరీ దూకుడుగా ధరల పెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొన్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోత విషయంలో జాప్యం చేసే అవకాశాలు, రష్యా–ఉక్రెయిన్‌ మధ్య శాంతి చర్చలు, ట్రేడ్‌ టారిఫ్‌ల అమలు నెమ్మదించడం వంటి అంశాలు ప్రతికూలంగా మారొచ్చని వివరించాయి.ఇన్వెస్టర్లు, పరిశ్రమల దన్ను.. ఇటు ఇన్వెస్టర్లు, అటు పరిశ్రమల నుంచి డిమాండ్‌ నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పసిడికి మించి వెండి ర్యాలీ చేసే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో వెండి ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా వేస్తోంది.అంటే సగటున 20 శాతం రాబడి ఉండొచ్చు. దీంతో ప్రస్తుతం రేటు తగ్గితే కొనుక్కుని దగ్గర పెట్టుకోవడం మంచిదని సూచించాయి. అయితే, వెండి మీద అధిక రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాయి. పసిడితో పోలిస్తే వెండి ధరలో హెచ్చుతగ్గులు 2.5 రెట్లు అధికంగా ఉంటాయని వివరించాయి. ఏడాది వ్యవధిలో వెండి ఈటీఎఫ్‌ల్లో రాబడులు (%)ఏబీఎస్‌ఎల్‌ సిల్వర్‌ 36.36 కోటక్‌ సిల్వర్‌ 36.34 డీఎస్‌పీ సిల్వర్‌ 36.21 హెచ్‌డీఎఫ్‌సీ సిల్వర్‌ 36.13 యూటీఐ సిల్వర్‌ ఈటీఎఫ్‌ 36.01 ఫిబ్రవరి 20 గణాంకాల ప్రకారం–సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
Advertisement
Advertisement