ఈ రోజు టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల ప్రజలు వేలాదిగా నా అడుగులో అడుగులేశారు. నాన్నగారి జ్ఞాపకాలు పంచుకున్నారు. ఆయన సాయం గుర్తుచేసుకున్నారు. సీతారాంపురానికి చెందిన ఏడు పదుల వృద్ధుడు బెండి రాజ్‌గోపాలరావు ఒకప్పుడు టీడీపీ వీరాభిమాని. ఇప్పుడాయన గుండె చప్పుడులో నాన్నేగారే వినిపిస్తున్నారు. అంతగా అభిమానించడానికి ఆయన చెప్పిన కారణం విని నాకెంతో ఆనందమేసింది. గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో.. నాన్నగారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ప్రాణం పోసిందన్నాడు. ఆ కొత్త జీవితం నాన్నగారిచ్చిందేనని పొంగుకొస్తున్న ఆనందబాష్పాలను తుడుచు కుంటూ చెప్పాడు.