ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై శుక్రవారం ఏసీబీ మెరుపుదాడులు నిర్వహించింది. ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలోని పదమూడు జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీస్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.
విజయనగరం: విజయనగరం వెస్ట్‌జోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్‌కి వస్తున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తున్నామని ఏసీబీ డిఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. ఎనిమిది మంది అనధికార డాక్యుమెంట్ రైటర్స్ నుంచి రూ.50వేలు, రిజిస్ట్రార్ కార్యాలయం ఐదుగురు సిబ్బంది దగ్గర నుంచి రూ.11 వేలు నగదను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అనంతపురం: అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ మూర్తి నుంచి రూ.2.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు, కొంతమంది ప్రైవేటు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తూర్పుగోదావరి: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించారు.దాడులు జరుగుతున్నాయని ముందుగానే సమాచారం అందడంతో కొందరు అధికారులు తప్పించుకున్నారు. ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రకాశం: జిల్లాలోని సింగరాయకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలువురి సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.