సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు చోరీ చేస్తున్న బీహార్‌కు చెందిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. కోటి విలువైన నగలు, ఒక టీవీఎస్ అపాచీ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ 9న పెద్ద మొత్తంలో డైమండ్, బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బంజారాహిల్స్ పీఎస్‌కు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో కేసును ఒక సవాలుగా తీసుకొని చేధించినట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. నిందితులందరూ బీహార్ రాష్ట్రంలోని మధుబని ప్రాంతానికి చెందినవారని, వీరి గ్యాంగ్‌కు రామషిష్ ముఖియా నేతృత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. దొంగతనానికి పాల్పడే ముందు నెల రోజుల ముందే రెక్కీ నిర్వహించి వంట మనుషులుగా చేరుతామని వచ్చి వారిని నమ్మించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో చోరీలకు పాల్పడుతారని వెల్లడించారు.