interstate gang
-
డీసీఎంను రీ డిజైన్ చేసి గంజాయి సరఫరా
నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే 400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్ వీరన్న, శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన కేతావత్ శంకర్‌నాయక్, వరంగల్ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు శనివారం ఉదయం డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐలు మల్లికార్జున్‌రెడ్డి, మహేష్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ బీమా పేరిట మోసం
కడప అర్బన్: వైఎస్సార్ బీమా పేరుతో మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని వైఎస్సార్ జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో రెండు నెలలుగా ఓ అంతర్రాష్ట్ర ముఠా పథకం ప్రకారం కోవిడ్ సందర్భంగా మరణించిన మృతుల వివరాలను సేకరిస్తున్నది. వాటి ఆధారంగా ఆయా మృతుల బంధువులకు ఫోన్లు చేసి.. తాము కలెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామని, వైఎస్సార్ బీమా పథకం కింద నష్టపరిహారం వస్తుందని మభ్యపెడుతోంది. అయితే అంతకుముందు.. కొంతమొత్తం ప్రభుత్వానికి చెల్లిస్తేనే ఆ మేరకు నష్టపరిహారం మంజూరవుతుందని అమాయక ప్రజలను నమ్మిస్తున్నది. అనంతరం ఫోన్–పే తదితర మనీ వ్యాలెట్ల నుంచి లక్షల రూపాయలను స్వాహా చేస్తోంది. కడపకు చెందిన బీరం రమణారెడ్డి, నిర్మల, ఎం.వి. సునీత, ఖాజీపేటకు చెందిన నాగవేణి, పెండ్లిమర్రికి చెందిన విఘ్నేశ్వరి, విజయకుమారి, బి.మఠానికి చెందిన కృష్ణచైతన్య, ప్రొద్దుటూరుకు చెందిన జింక హారతి, బద్వేల్‌కు చెందిన పి.ఆదిలక్ష్మి సదరు ముఠా చేతిలో చిక్కి సుమారు రూ.9 లక్షల మేరకు సమర్పించుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేసి కడప వన్‌టౌన్ సీఐ ఎన్.వి.నాగరాజు దర్యాప్తు చేపట్టారు. కేసు పరిశోధనలో భాగంగా కడప సైబర్ క్రైం టీం సహాయంతో యూపీఐల ఆధారంగా 9 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. వీటిలోని రూ.7,34,964 ఫ్రీజ్ చేశారు. ముఠాలో సభ్యుడైన ఖాజీపేట మండలం మిడుతూరు గ్రామానికి చెందిన మీనుగ వెంకటేష్‌ను ఇర్కాన్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. కొంతమంది వ్యక్తులతో కలిసి వెంకటేష్ ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి బీమా పేరిట దందాను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడీ పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేస్తున్న పది మందితో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట పోలీస్‌లు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.90 లక్షల ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు, రూ.60 వేల నగదు, ఒక కారు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫన్‌టైం రోడ్డులోని విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వర్మ ఈ కేసు వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు..ఈ నెల 19న పటమట పోలీస్ పరిధిలోని మారిస్ స్టెల్లా కాలేజీ సమీపంలోని యాక్సిస్ బ్యాంకులో ఎనిమిది రూ.500 నకిలీ ప్లాస్టిక్ కట్టలను అంతర్రాష్ట్ర ముఠా ఏటీఎం డిపాజిట్ మిషన్‌లో వేసింది. నకిలీ నోట్లు అన్ని మిషన్‌లోకి రావడాన్ని గమనించిన బ్యాంకు అధికారులు పటమట పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులను పట్టుకునేందుకు విజయవాడ సీపీ రాణా 3 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న విజయవాడ భారతీనగర్‌కు చెందిన తాతపూడి రాజు, జి.కొండూరు మండలం వెలగలేరుకి చెందిన రమేష్‌బాబు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన ఆంజనేయులు, సుజాత, సాయిమణికంట, రాజు, బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన అబ్రహం, పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన హనుమంతరావు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మధుమంచి ప్రసాద్, చిలుకూరి మరియదాస్‌ను బుధవారం పటమట పోలీస్ స్టేషన్ పరిధి భారతీనగర్‌లో టాస్క్‌ఫోర్స్, పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను అసలు నోట్లుగా మార్చి, తక్కువ నగదుకు ఎక్కువ నగదు పొంది వాటితో జల్సాలు చేద్దామనే ఉద్దేశంతో నిందితులు ఈ వ్యవహారానికి పాల్పడ్డారు. వీరిలో ఆంజనేయులు, రమేష్‌బాబు, అబ్రహం, రాజు నకిలీ నోట్ల చలామణీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
గన్‌తో బెదిరించి దోపిడీలు.. వాళ్ల టార్గెట్ తెలిస్తే ఆశ్చ ర్యపోతారు!
నాగోలు: టైర్ల లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి.. తుపాకితో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పహడీషరీఫ్ పోలీసులు, ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.44,77,760 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం..హర్యానా రాష్ట్రం, మేనాత్ జిల్లాకు చెందిన జంషీద్ ఖాన్, రహెల్ ఖాన్, ఆజాద్‌లు ముఠాగా ఏర్పడ్డారు. లోడ్ చేసిన కంటైనర్లతో వెళ్లే లారీలను దోచుకోవాలని పథకం వేశారు. జనవరి 18న అపోలో లారీ టైర్లు (220) దోచుకున్నారు. లిఫ్ట్ అడిగి..లారీలోకి ఎక్కి గన్‌తో బెదిరించి..డ్రైవర్, క్లీనర్‌ను కట్టివేసి టైర్లు చోరీ చేశారు. ఈ నెల 15వ తేదీన తమిళనాడు నుంచి బయలుదేరిన కంటైనర్ నుంచి మరో కంపెనీ టైర్లను ఇదే పద్ధతిలో చోచుకున్నారు. లిఫ్ట్ అడిగి కంటైనర్ ఎక్కిన వీరు...ఈ నెల 17న నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలోకి కంటైనర్ రాగానే జంషీద్ ఖాన్, రహీల్ ఖాన్లు క్లీనర్‌ను గన్‌తో బెదిరించి కంటైనర్‌ను రోడ్డు పక్కన ఆపి, డ్రైవర్, క్లీనర్లను తాడుతో కట్టి క్యాబిన్లో పడివేశారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, అఫ్రోజ్ ఆలీ ఖాన్ల సాయంతో కాటేదాన్‌లో ఉన్న కమల్ కబ్రా టైర్ల గోదాములో దోచుకున్న టైర్లను తక్కువ ధరకు అమ్మివేసి తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై కంటైనర్ వదిలేసి పారిపోయారు. కంటైనర్ రోడ్డుపై ఎక్కవ సేపు ఆగి ఉండడంతో స్థానికులు గమనించి లారీ క్యాబిన్లో కట్టిపడేసి ఉన్న డ్రైవర్, క్లీనర్లను రక్షించారు. లారీ డ్రైవర్ పహడీషరీష్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల ఆటకట్టించారు. జంషీద్ ఖాన్ ఇటీవల ఢిల్లీకి విమానంలో వెళ్తున్నట్లు పోలీసులు తెలుసుకుని అక్కడి పోలీస్‌లకు సమాచారం ఇచ్చి, సీఐఎస్ఎఫ్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. చోరీకి సహకరించిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, అఫ్రోజ్ అలీఖాన్, టైర్లు కొనుగోలు చేసిన కమల్ కబ్రాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 152 టైర్లు, రూ.20 వేల నగదు, కారు, బైకు, నాలుగు మొబైల్ ఫోన్లు, 8ఎంఎం లైవ్ రౌండ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రహీల్ ఖాన్, ఆజాద్‌ల కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
'అడ్డు వస్తే హత్యలకు కూడా వెనుకాడరు'
-
'అడ్డు వస్తే హత్యలకు కూడా వెనుకాడరు'
సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు చోరీ చేస్తున్న బీహార్‌కు చెందిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. కోటి విలువైన నగలు, ఒక టీవీఎస్ అపాచీ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ 9న పెద్ద మొత్తంలో డైమండ్, బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బంజారాహిల్స్ పీఎస్‌కు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో కేసును ఒక సవాలుగా తీసుకొని చేధించినట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. నిందితులందరూ బీహార్ రాష్ట్రంలోని మధుబని ప్రాంతానికి చెందినవారని, వీరి గ్యాంగ్‌కు రామషిష్ ముఖియా నేతృత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. దొంగతనానికి పాల్పడే ముందు నెల రోజుల ముందే రెక్కీ నిర్వహించి వంట మనుషులుగా చేరుతామని వచ్చి వారిని నమ్మించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో చోరీలకు పాల్పడుతారని వెల్లడించారు. ఇదే విధంగా గత డిసెంబర్లో బాధితుని ఇంట్లో వంట మనుషులుగా చేరి వారందరూ ఫంక్షన్‌కు వెళ్లగానే రూ 1.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్ నగలను చోరీ చేశారని సీపీ తెలిపారు. గతంలోనూ రామషిష్ ముఖియాపై బీహార్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు తెలిసిందని వెల్లడించారు. A1 రామాషిష్ ముఖియా, A2 భగవత్ ముఖియా,A3 రాహుల్ ముఖియా, A4 పీతాంబర్ మండల్, A5 బోలా ముఖియా, A6 హరిష్ చంద్ర ముఖియాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ చాలా ప్రమాదకరమని, చోరీలు చేసే సమయంలో ఎవరైనా అడ్డువస్తే హత్యలు చేయడానికి కూడా వెనుకాడరని తెలిపారు. కాగా వీరు చోరీకి పాల్పడిన తర్వాత బీహార్‌కు వెళ్లారని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నెలరోజుల పాటు బీహార్‌లో గాలించి నిందితులను పట్టుకున్నట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే చోరీ చేసిన డైమండ్ నగలను సిమెంట్‌తో కప్పి వేసి బంగారాన్ని మాత్రం ఓ దుకాణంలో అమ్మివేసినట్లు నిందితులు తెలిపారని శ్రీనివాస్ పేర్కొన్నారు. -
నేరస్తులపై నిఘా
సాక్షి, సిటీబ్యూరో: బిహార్‌కు చెందిన అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్, చంబన్ ముఠా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బవరియా ముఠా.. మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన పార్ధీ గ్యాంగ్స్.. నగరంపై పంజా విసురుతున్న ఇలాంటి వలస నేరస్తులకు చెక్ పెట్టేందుకు నగర పోలీసులు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘క్రైమ్ అలర్ట్ సిస్టం’ (సీఏఎస్) పేరుతో వ్యూహాత్మక విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో ప్రతిపాదన దశలోనే ఆగిపోయిన ఈ విధానాన్ని ‘విజన్ 2020’లో కీలక ప్రాధాన్యం ఇచ్చి అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాకు చెందిన ముఠాలు కొన్నేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వరుసపెట్టి పంజా విసిరాయి. దాదాపు నాలుగు రాష్ట్రాల పోలీసులకు ఈ గ్యాంగ్స్ ముచ్చెమటలు పట్టించాయి. అప్పట్లో వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఎవరి చర్యలు వారు తీసుకున్నా ఫలితం అంతంత మాత్రమే. దీంతో అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)కు వచ్చారు. ఆ ముఠాలు నివసించే ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులనే ఆశ్రయించారు. వారి సహకారంతోనే ఈ ముఠాలను కట్టడి చేయగలిగారు. నిత్యం నగరంలో పంజా విసురుతున్న అటెన్షన్ డైవర్షన్ ముఠాలు, సూడో పోలీస్ గ్యాంగ్స్, చైన్ స్నాచర్లు, దోపిడీ, చోరీ ముఠాలకు చెక్ చెప్పేందుకూ ఇలాంటి విధానాన్నే అమలు చేయాలని సిటీ కాప్స్ నిర్ణయించారు. దీనికి క్రైమ్ అలర్ట్ సిస్టం (సీఏఎస్) అని పేరు పెట్టారు. జ్యువెలరీ దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలను టార్గెట్‌గా చేసుకుని జనాల పుట్టి ముంచే ఈ ముఠాలన్నీ బయటి ప్రాంతాల నుంచి వచ్చేవే. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్‌లో చెన్నై సమీపంలో ఉన్న రామ్జీనగర్, తిరుచ్చితో పాటు మహారాష్ట్రలోని పుణె, భివండి నుంచి వచ్చే ముఠాలు కొన్ని ఉన్నాయి. చిత్తూరు జిల్లా నగరి ముఠాలు కొన్ని నగరంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఇక, సూడో పోలీసుల విషయానికి వస్తే బెంగళూరు పరిసరాలకు చెందిన ఇరానీ గ్యాంగ్, బీదర్, గుంతకల్ నుంచి వచ్చి తమ ‘పని’ చక్కపెట్టుకు పోయేవాళ్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సహా అనేక ప్రాంతాల నుంచి వచ్చి గొలుసులు లాక్కుపోతున్న చైన్ స్నాచింగ్ గ్యాంగ్ సైతం ఉంటున్నాయి. పోలీసు రికార్డుల్లోకి ఎక్కకుండా పని చక్కపెట్టుకుపోతున్న ముఠాలు, నేరగాళ్లు ఇంకా ఎందరో ఉన్నారనేది పోలీసులే అంగీకరిస్తున్నారు. వీరంతా నగరంలోని లాడ్జిలు, శివారు ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో డెన్స్ ఏర్పాటు చేసుకుని టిప్‌టాప్‌గా తయారై విద్యార్థులు, ఉద్యోగులు మాదిరిగా సంచరిస్తారు. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్‌కు చెందిన ఐదారుగురు గ్యాంగ్‌గా బయటకు వచ్చి బ్యాంకులు, జ్యువెలరీ దుకాణాలు, వ్యాపార కేంద్రాల వద్ద రెక్కీ నిర్వహించి, కాపు కాసి పంజా విసురుతారు. చైన్ స్నాచర్లైతే వస్త్ర వ్యాపారుల ముసుగులో షెల్టర్లు తీసుకుంటూ రెండు బృందాలుగా బయటకు వచ్చి పక్కా పథకం ప్రకారం రెచ్చిపోతున్నారు. అయితే, నగరంలో ఎల్లప్పుడూ వీరిపై నిఘా వేసి ఉంచడం సాధ్యం కావట్లేదు. ఒకసారి నగరంలోకి ప్రవేశించిన గ్యాంగ్ వరుసపెట్టి నేరాలు చేసి వెళ్తుంది. ఈ ముఠాలను పట్టుకోవడం, రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రయత్నిస్తే పోలీసులకూ ఒక్కోసారి చావుదెబ్బలు తప్పట్లేదు. ఈ ఇబ్బందులను అధిగమించడం కోసం సీఏఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘‘క్రిమినల్ అలర్ట్ సిస్టం (సీఏఎస్)లో నగర పోలీసులకు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో వారిసహకారం తీసుకుంటారు. ఆయా రాష్ట్రాలు, నేరగాళ్లు నివసించే ప్రాంతాలకు చెందిన అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతుంటారు. అనివార్య కారణాల నేపథ్యంలో వారి ప్రాంతంలో ఉంటున్న కరుడుగట్టిన, వ్యవస్థీకృత ముఠాలను అరెస్టు చేయడానికి అవకాశం లేని నేపథ్యంలో ఆయా అధికారులను వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా కోరతారు. అక్కడ నుంచి ఈ గ్యాంగ్స్ బయలుదేరిన వెంటనే వారికదలికలను పసిగట్టినగర పోలీసులను అప్రమత్తం(అలర్ట్) చేసేలా నెట్వర్క్ ఏర్పటు చేసుకుంటారు. తద్వారా నగర వాసులతో పాటు జ్యువెలరీ దుకాణాలు, బ్యాంకుల వారిని అప్రమత్తం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి నేరాలునిరోధించడం, అవకాశం దొరికితే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు.’’ -
ఒడిశా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్
నేరేడ్మెట్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. కొంతకాలంగా తెలంగాణ, మహరాష్ట్ర కేంద్రంగా గంజాయి దందా చేస్తున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి çరూ.31.62లక్షల విలువవైన 130 కిలోల గంజాయి, రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లు, రూ.12వేల నగదను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, చిన్నగారికుంట తండాకు చెందిన కారు డ్రైవర్లుగా పని చేస్తున్న బానోతు సుధాకర్, గూడెపుకుంట తండాకు చెందిన జర్పుల హుస్సేన్ స్నేహితులు. వీరు తమ అనుచరులైన జతోత్తండాకు చెందిన దరావత్ చిరంజీవి అలియాస్ రఘు, మహ్మదాపురానికి చెందిన కంభంపాటి నాగేశ్వర్రావు, పెద్దగారికుంటకు చెందిన బానోతు వెంకన్న, చిన్నగారికుంటకు చెందిన బానోతు సురేష్ నాయక్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొన్ని నెలలుగా గంజాయి అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు. విశాఖపట్నం పరిసరాల్లో చెందిన గంజాయి విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వీరు ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని ధారాకొండ నుంచి కిలో రూ.2వేల చొప్పుర గంజాయి కొనుగోలు చేసి, కార్లలో హైదరాబాద్‌లోని దూల్పేట్, ఓల్డ్‌సిటీ తదితర ప్రాంతాలతోపాటు మహరాష్ట్రలోని ఏజెంట్లకు కిలో రూ.7వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఏజెంట్లు వాటిని చిన్న ప్యాకెట్లగా మార్చి, యువకులు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై సమాచారం అందడంతో సోమవారం ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా వనస్థలిపురం ఠాణా పరిధిలోని ఆటో నగర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అటుగా వస్తున్న మహింద్రా టీయూవీ, స్విఫ్ట్ టూర్ కార్లను ఆపి సోదా చేయగా సీట్లు, డోర్లలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో ప్రధాన నిందితులు బానోతు సుధాకర్, జర్పుల హుస్సేన్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారం అధారంగా దారావత్ చిరంజీవి, కంభపాటి నాగేశ్వర్రావు, బానోతు వెంకన్న, బానోతు సురేష్లను అరెస్టు చేశారు. ఎవరినీ వదలిపెట్టం గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఎవరినీ వదలిపెట్టమని రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ గంజాయి సాగు లేదన్నారు. ఓఆర్ఆర్, ఇతర రాష్ట్రాలకు హైవే కనెక్టివిటీ ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడున్నరేళ్లలో 4వేల కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నార్కోటిక్, డ్రగ్స్ ట్రాఫికర్ చట్టం కింద గంజాయి వ్యాపారం చేసే వారి ఆస్తిని జప్తు చేయడంతోపాటు పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. గతంలో గంజాయి వ్యాపారం కేసులో కీసరలో రూ.కోటి విలువైన ఆస్తిని జప్తు చేసిన విషయాన్ని సీపీ గుర్తు చేశారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 248 కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఇందులో 8మందికి జీవితఖైదు విధించినట్లు సీపీ వివరించారు. పోలీసులకు క్యాష్ రివార్డులు అందజేశారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐలు రవికుమార్, వెంకటయ్య, ఎస్ఐలు వెంకటేశ్వ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. – సీపీ మహేష్‌భగవత్ పరారీలో గంజాయి విక్రేత ధారాకొండకు చెందిన గంజాయి విక్రేత సురేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సురేష్ నుంచి గంజాయి కొనుగోలు చేసి, తెలంగాణ, మహరాష్ట్రలకు రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. -
గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు అంతరాష్ట్ర ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ, మీర్‌పేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 82 కిలోల గంజాయి, ఒక బైక్, రూ.35 వేల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన కమోజీ కొండల్ (31) నగరంలో మీర్‌పేటలో నివాసం ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్నాడు. కొండల్ 2017లో గంజాయి సరఫరా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మోతిగూడం పోలీసు స్టేషన్లో పట్టుబడాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. జైల్లో తూర్పు గోదావరి జిల్లా రామవరం మండలానికి చెందిన ఫంగితెలి తేజ (28) పరిచయమయ్యాడు. జైలు నుంచి వచ్చిన తరువాత వీరిద్దరూ కలిసి గంజాయి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. తేజ విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి, పాడేరు, ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన రాజు పరిచయమయ్యాడు. ఇతడు కూడా గంజాయి సరఫరా చేస్తుంటాడు. వీరితోపాటు విశాఖ జిల్లాకు చెందిన నాగార్జున, చిన్నబాబులతో కలసి ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని ట్రావెల్ బ్యాగుల ద్యారా నగరానికి తెచ్చేవారు. దీనిని కొండల్ నివాసం వద్ద నిల్వ ఉంచారు. పోలీసులకు పట్టుబడిందిలా.. మంగళవారం ఆసిఫ్ నగర్‌కు చెందిన సుబేడర్ వినోద్ సింగ్ కొండల్ దగ్గర 10 కేజీల గంజాయిని రూ.30 వేలకు కొనుగోలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కొండల్ ఇంటిపై దాడి చేసి 82 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినోద్ సింగ్ కొనుగోలు చేసిన గంజాయిని 100 గ్రాములుగా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మార్చి నగరంలోని విద్యాసంస్థల వద్ద అమ్మతున్నట్లు గుర్తించారు. అనంతరం కొండల్, ఫంగితెలి తేజ, నాగార్జున, చిన్నబాబు, వినోద్ సింగ్‌లను అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన రాజు పరారీలో ఉన్నాడని.. త్వరలో అతడిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. -
అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా గుట్టురట్టు
చాంద్రాయణగుట్ట: చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. బుధవారం చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వర్ రావు, బాలాపూర్ ఇన్స్పెక్టర్ వి.సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాకపల్లి గంగాధర్ రెడ్డి, వరంగల్‌కు చెందిన పొట్ల జ్యోతి అలియాస్ ఫౌజియా, జగద్గిరి గుట్టకు చెందిన జి.ప్రసాద్, అబ్దుల్లా పూర్ మెట్కు చెందిన సింధు, ఎస్.అరుణ, బి.ఎన్.రెడ్డికి చెందిన కొర్ర మున్నా, విశాఖపట్టణానికి చెందిన పెద్ది లక్ష్మి, సయ్యదా బీ, కనక రాజు ముఠా ఏర్పడి చిన్నారులను ఎత్తుకెళ్లి ఇతర నగరాల్లో విక్రయిస్తున్నారు. గత మార్చి 25న మధ్యాహ్నం మహ్మద్ నగర్‌కు చెందిన షేక్ ఫజల్ చిన్న కుమారుడు షేక్ సోఫియాన్(2.5) ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వర్ రావు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా బండ్లగూడలో గంగాధర్ రెడ్డి, ఫౌజియాలను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు వారిచ్చిన సమాచారం ఆధారంగా ఏలూరు, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారు విక్రయించిన బాలుడు సోఫియన్‌తో పాటు బండ్లమొట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్‌నకు గురైన పసికందు(ఒక నెల), బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అపహరణకు గురైన షేక్ ఖాజాల(2)ను గుర్తించి రక్షించారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సైలు కొండల్ రావు, కృష్ణయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ మొత్తానికి విక్రయం ఈ ముఠా చిన్నారులను కిడ్నాప్ చేసి రూ.లక్షల్లో విక్రయించినట్లు విచారణలో వెల్లడయ్యింది. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్ సోఫియన్‌ను ఏలూరులో సంతానం లేని రాములుకు రూ.2.8 లక్షలకు విక్రయించగా, బాలాపూర్ ఠాణా పరిధిలో కిడ్నాప్‌నకు గురైన షేక్ ఖాజాను హనుమంతరావు అనే వ్యక్తికి రూ.3.10 లక్షలకు, బండ్లమొట్టు పీఎస్ పరిధిలో కిడ్నాప్‌నకు గురైన పసికందును రాజమండ్రికి చెందిన శిరీషకు రూ.2.5 లక్షలకు విక్రయించినట్లు తెలిపారు. -
నేరాలే వీరి వృత్తి
కర్ణాటక , బనశంకరి : ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన బెంగళూరు నగరం నేడు నేరాల నగరిగా మారిపోయింది. అంతరాష్ట్ర గ్యాంగుల నేర కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పోలీసులకు వారిని పట్టుకోవడం ఒక సవాల్‌గా మారింది. గత ఏడాది అంతరాష్ట్ర గ్యాంగ్స్‌పై వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయంటే నేరాలు ఏ విధంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు కమిషనరేట్ పరిధిలోని 8 డీసీపీ విభాగాల్లో అంతరాష్ట్ర గ్యాంగ్‌లు చోరీలు, దోపిడీలకు తెగబడ్డారు. స్థానిక గ్యాంగ్‌లు ఒక ప్రాంతంలో మాత్రమే నేర కార్యకలాపాలకు పాల్పడతారు. వీరి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సులభం. కానీ బయటి రాష్ట్రాలనుంచి గ్యాంగ్స్ నియంత్రణ కష్టసాధ్యమని క్రైమ్ బ్రాంచ్ అధికారులు చెబుతున్నారు. బుడకట్టు, బవారియా.. : ఈ సముదాయానికి చెందిన వారు నగర జీవనానికి అలవాటుపడి నేరాలే వీరి వృత్తి. వీరికి మరో ఉపాధి తెలియదు. మరొకటి బవేరియా గ్యాంగ్, ఉత్తర భారతానికి చెందిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలిచే బవేరియా గ్యాంగ్ దేశవ్యాప్తంగా పోలీసులకు సవాల్ మారారు. బవేరియా గ్యాంగ్ ఒక నగరంలో దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన అనంతరం మూడు నాలుగు నెలల వరకు ఆ ప్రాంతం వైపు వెళ్లరు. వేరే రాష్ట్రాలకు వెళ్లి ఇతర నగరాల్లో తమ తడాఖా చూపిస్తారు. బెంగళూరులో ఒక గ్యాంగ్ పట్టుబడితే ఆ గ్యాంగ్ మళ్లీ ఇక్కడకు రారు. మరో కొత్త గ్యాంగ్ ఇక్కడికి వస్తుంది. దీంతో బవారియా గ్యాంగ్‌లు ట్రాక్ రికార్డ్ నిర్వహించడం కష్టతరంగా మారిందని నేరవిభాగం పోలీసులు చెబుతున్నారు. చోరీ సొత్తును ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తారు. బవేరియా, ఇరానీ, ఓజికుప్పం, రామ్జీనగర, బిట్రగుంట గ్యాంగ్‌లు చోరీకి పాల్పడిన సొత్తును తమ నాయకుడికి అప్పగిస్తారు. అతనే చోరీ సొత్తు విక్రయించే బాధ్యత తీసుకుంటాడు. చోరీల్లో పాల్గొనే కుటుంబాల నిర్వహణకు సాయపడటం, పోలీసులకు పట్టుబడిన గ్యాంగ్ సభ్యులను పోలీస్, కోర్టులనుంచి జామీనుపై విడిపించే పనిచేస్తారు. ఆ గ్యాంగ్‌లకు లీడర్ ఒక్కరే ఉండరు అప్పుడప్పుడు మారుతుంటారు. బెంగళూరు పోలీసులకు ఈ గ్యాంగ్స్ సొంత ఊర్లలోకి వెళ్లి గాలించడం అసాధ్యం. వీరికి తోడు నేపాలీ గ్యాంగ్ కూడా పోలీసులకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఉపాధి నిమిత్తం వచ్చి చోరీలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. -
నిమ్మకాయలతో గుప్త నిధులట!
రోడ్లల్లో ఎక్కడైనా కట్ చేసి, కుంకుమ పెట్టి పడేసిన నిమ్మకాయలను చూస్తే జనాలకు ఒకింత భయమే. తమకు కీడు జరుగుందనే భయంతో వాటిని దాటేందుకు కూడా సాహసించక, పక్కగుండా వెళ్లిపోతుంటారు. సరిగ్గా ఈ పాయింటే పట్టుకుని ‘మంత్రించిన నిమ్మకాయలు..మహిమ గల నిమ్మకాయలు ’ పేరిట ప్రజల జేబులకు చిల్లు పెట్టారు. చివరకు పోలీసులు వారికి చెక్ పెట్టారు. చిత్తూరు, శాంతిపురం: మహిమలు గల నిమ్మకాయల పేరిట అమాయక జనం రసం పిండిన అంతర్రాష్ట్ర ముఠాను రాళ్లబూదుగూరు పోలీసులు పట్టుకున్నారు. కుప్పం సీఐ కృష్ణమోహన్, రాళ్లబూదుగూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపిన వివరాలు.. గురువారం తెల్లవారుజామున నంజంపేట శివార్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేస్తే మహిమ గల నిమ్మకాయలంటూ ప్రజలకు అంటగట్టి, మోసగిస్తున్నట్టు తేలింది. ఈ నిమ్మకాయల్లోకి ఇనుప వస్తువులు గుచ్చితే అవి వంగిపోతాయని ప్రయోగపూర్వకంగా చూపి జనాన్ని ఆకర్షిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో నిందితులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ నిమ్మకాయను కలిగి ఉన్న వారికి గుప్తనిధులు దొరుకుతాయని ప్రచారం చేస్తూ జనాన్ని బోల్తా కొట్టించారు. సిబ్బందికి రివార్డు అందజేస్తున్న సీఐ కృష్ణమోహన్ వీళ్ల మాయమాటలు నమ్మి నిమ్మకాయలు పుచ్చుకుని పలువురు డబ్బులు భారీ మొత్తంలో ఇచ్చి మోసపోయారు. అయితే, తీరా నిమ్మకాయల్లో రసం తప్పితే మహిమలేమీ లేవని జ్ఞానోదయమయ్యేసరికి ఇక పరువు పోతుందని కిమ్మనకుండా ఉండిపోయారు. నిమ్మకాయల ముఠా సమాచారం పోలీసుల చెవిన పడడంతో ఎట్టకేలకు ఏడుగురిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో బెంగళూరుకు చెందిన బాషా, బంగారుపేట ప్రాంతానికి చెందిన రమేష్, మూర్తితో పాటు కుప్పం మండలానికి చెందిన మునిరత్నం, శాంతిపురం మండలానికి చెందిన జయరాం, హరీష్‌కుమార్, రవీంద్ర అని తేలింది. వారి నుంచి నిమ్మకాయలూ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల రసం పిండారు. ఈ కేసుకు సంబంధించి వీరిని శాంతిపురం తహసీల్దారు ఎదుట హాజరు పరచి బైండోవర్ చేశారు. నిమ్మకాయల ముఠా బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ చేసి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసు అధికారులు భరోసా ఇచ్చారు. నిమ్మకాయల ముఠా భరతం పట్టిన సిబ్బందికి రివార్డును అందజేశారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
గచ్చిబౌలి: పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌళి కమిషనరేట్‌లో సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లోని, హపూర్ జిల్లాకు చెందిన మహ్మద్ సబ్దార్, షాన్వాజ్, నదీమ్, మహ్మద్ నయీమ్ అలియాస్ సోను, మహ్మద్ రషీద్ అలియాస్ మున్నా, మహ్మద్ ముస్తాఫా, మహ్మద్ ఆసీఫ్, ఇమ్రాన్ తదితరులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై ఢిల్లీ, బోపాల్, గ్వాలియర్, చంద్రపూర్, అమరావతి, ఔరంగాబాద్, బులంద్‌షాహార్, విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. రెక్కీ నిర్వహించి పగటి పూట చోరీలకు పాల్పడే వీరు జనవరి 20న రాజేంద్రనగర్‌లో ఓ ఇంట్లో చోరీ చేశారు. కొంపల్లి, కామాటిపుర ప్రాంతాల్లోనూ పంజా విసిరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో గత నెల 31న గ్యాంగ్ లీడర్ మహ్మద్ సబ్దార్‌తో పాటు నిందితుడు షాన్వాజ్, రిసీవర్ ఇమ్రాన్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 500 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, ఇనుప రాడ్డు, స్క్రూడ్రైవర్, ఐదు సెల్ఫోన్లు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులకు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ దయానంద్, సీఐలు పురుషోత్తం, వెంకటేశం, అశోక్, ఎస్ఐ రాజు పాల్గొన్నారు. -
చోరీ కోసం సొరంగం...
నాగోలు: పైప్లైన్ల నుంచి డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న 12 మంది అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు సభ్యులను మల్కాజ్గిరి సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.90.40లక్షల నగదు, డీజిల్ ట్యాంకర్, స్కార్పియో, బైక్, డీజిల్ దొంగతనానికి ఉపయోగించే పైప్‌లు, మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియంకు చెందిన డీజిల్ అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా చర్లపల్లి నుంచి ఘట్కేసర్ వరకు 17 కిలోమీటర్ల మేర సరఫరా జరుగుతుంది. దీనిని గుర్తించిన మహరాష్ట్రకు చెందిన పాతనేరస్తుడు హఫీజ్ అజిస్ చౌదరి అలియాస్ హఫీజ్, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్ యజమాని జియోలాల్ చంద్ షేక్ అలియాస్ చెడ్డ అలియాస్ చెడ్డీ, మహబూబ్ నగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన బిన్ని శ్రీనివాసులు ముఠాగా ఏర్పడ్డారు. బర్కత్‌పురకు చెందిన మహిళను వివాహం చేసుకున్న హఫీజ్ తరచూ నగరానికి రాకపోకలు సాగించేవాడు. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం సరఫరా జరిగే పైప్‌లైన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన అతను చర్లపల్లి– ఘట్కేసర్ మధ్యలో మహేందర్‌గౌడ్‌కు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించాడు. డీజిల్ సరఫరా అవుతున్న పైప్‌లైన్‌కు రంధ్రం చేసి మోటర్ల ద్వారా తోడి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవాడు. 1.30లక్షల లీటర్ల డీజిల్ చోరీ... భారత్ పెట్రోలియం నుంచి 84,365 లీటర్లు, ఇండియన్ ఆయిల్ నుంచి 46,232 లీటర్ల చొప్పున మొత్తం 1.30లక్షల కిలోల డీజిల్‌ను 7 ట్యాంకర్ల ద్వారా అమ్మకా>లు కొనసాగించారు. ఈ క్రమంలో నగరానికి చెందిన మొహాద్ అబ్దుల్ అబ్రార్‌తో పాటు ముంబైకి చెందిన ట్యాంకర్ డ్రైవర్లు సునీల్ అనిల్ మదేవార్, వాసు, సూర్యపేట జిల్లా, కొత్తెగూడం కుచెందిన జయకృష్ణ, శ్రీకాంత్ నరేష్‌రెడ్డి, రాంబల్లి యాదవ్, సురేష్ కుమార్ ప్రజాపతి, సర్జూ అలియాస్ అహ్మద్ ఖాన్ ద్వారా డీజిల్‌ను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేశారు. హఫీజ్ 2013లో నాంపల్లి పీఎస్ పరిధిలో దొంగనోట్ల కేసులో అరెస్టై జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. 2015లో ముంబైలో ఇదే కేసులో జైలు కెళ్లాడు. మొహద్ అబ్దుల్ అబ్రార్ పై ముంబైలో నకిలీ కరెన్సీ కేసు ఉండగా, జియోలాల్ చంద్ షేక్‌పై ముంబైలో డీజిల్ దొంగతనం కేసులు, రాబరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. డీజిల్ సరఫరా సమయంలో తరుచూ డీజిల్ తక్కువగా వస్తున్నట్లు గుర్తించిన భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం అధికారులు కీసర, మల్కాజ్గిరి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులు హఫీజ్ అజిస్ చౌదరి, బిన్ని శ్రీనివాస్‌లు, మొహాద్ అబ్దుల్ అబ్రార్ , మారోజు జయకృష్ణను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది కోసం స్పెషల్ పార్టీ పోలీసులు గాలిస్తున్నట్లు సీపీ తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన మల్కాజ్గిరి, కీసర పోలీసులకు రివార్డు అందజేశారు. సమావేశంలో రాచకొండ క్రైం డీసీపీ కేఆర్.నాగరాజు, మల్కాజ్గిరి డీసీపీ. ఉమామహేశ్వరశర్మ అడిషనల్ డీసీపీ సలీమా, సీసీఎస్ సీఐ లింగయ్య, జగన్నాథరెడ్డి, రుద్రభాస్కర్, ప్రకాష్, వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, కృష్ణారావు, మల్లారెడ్డి, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. చోరీ కోసం సొరంగం... నిందింతులు డీజిల్ దొంగలించేందుకు ఏకంగా రెండు అడుగుల లోతున సొరంగాన్ని తవ్వి డీజిల్ సరఫరా అయ్యే పైపులైన్‌కు రంద్రం పెట్టి మోటార్ ద్వారా డీజిల్‌ను ట్యాంకర్లకు నింపేవారని పోలీసులు తెలిపారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. సంబంధిత అధికారులు డీజిల్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరారు. -
‘స్మార్ట్’తో చెక్..!
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది మార్చ్‌లో... పేట్లబురుజులో ఉన్న బంగారు నగల కార్ఖానాలో మూడు కేజీలకు పైగా పసిడి దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ఎత్తుకుపోయింది. జూలైలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నవదుర్గ వైన్స్‌లో షెట్టర్ పగులకొట్టిన చోరులు రూ.8,600 నగదు, కొన్ని మద్యం బాటిళ్లతో పాటు డీవీఆర్ కూడా పట్టుకుపోయారు. తాజాగా ఈ నెల 11న అబిడ్స్ ఠాణా పరిధిలోని ఫతేసుల్తాన్‌లేన్‌కు చెందిన సునీల్ అగర్వాల్ ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయిన నేపాల్ గ్యాంగ్ సైతం తమ వెంట డీవీఆర్ తీసుకువెళ్లింది. సైబర్ క్రిమినల్స్ మాత్రమే కాదు... సొత్తు సంబంధ నేరాలు చేసే నేరగాళ్లు సైతం నానాటికీ తెలివి మీరుతున్నారు. నేరాని సంబంధించి ఎలాంటి ఆధారాలు మిగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వెలుగులోకి వస్తున్న కొత్త ట్రెండ్ డీవీఆర్లు ఎత్తుకెళ్లడం. ఇటీవల కాలంలో అనేక ఉదంతాల్లో ఈ ధోరణి కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. అంతరాష్ట్ర ముఠాల నుంచి చిల్లర నేరగాళ్ల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తున్నారు. ప్రజలు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కేటుగాళ్లకు చెక్ చెప్పవచ్చని సూచిస్తున్నారు. సమయానుకూలంగా ‘స్మార్ట్’గా... ఏదైనా నేరం జరిగినప్పుడు దర్యాప్తులో భాగంగా చిన్న క్లూ అయినా సంపాదించాలని పోలీసులు ఎలా ఆలోచిస్తారో... ఏ చిన్న ఆధారం వదలకూడదని నేరగాళ్లూ ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు తమ వేలి, కాలి ముద్రలు దొరక్కుండా జాగ్రత్తపడేవారు. అప్పట్లో పోలీసుల దర్యాప్తునకు ఇవే కీలకం కావడంతో చేతికి గ్లౌజులు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని ‘రంగం’లోకి దిగేవారు. ఆ తర్వాతి రోజుల్లో పోలీసు జాగిలాలకు తమ జాడ చిక్కకుండా ఘటనాస్థలాల్లో కారం చల్లడం వంటి ఉదంతాలు వెలుగు చూశాయి. కొన్నేళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని ఆర్ఏకే లాడ్జిలో జరిగిన ఎన్ఆర్ఐ కుటుంబం హత్య కేసు సహా మరెన్నో నేరస్థలాల్లో ఈ ధోరణి కనిపించింది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు తీరు మారింది. అనేక కేసుల్లో సీసీ కెమెరాలే కీలక ఆధారాలు ఇస్తున్నాయి. దీంతో దొంగలు తొలినాళ్లల్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్క్‌లు, ముసుగులు వేసుకునే వారు. ఆపై వాటిని ధ్వంసం చేయడం చేశారు. ఈ ‘కాలక్రమంలో’ భాగంగా ఇటీవల కాలంలో కనిపిస్తున్న ట్రెండ్ డీవీఆర్‌ల చోరీ. అది ఎత్తుకుపోతే అంతే... ప్రస్తుతం దుకాణదారులతో పాటు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పబ్లిక్ ప్లేసుల్లో పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి రాలేదు. ప్రజలు, వ్యాపారులు ఏర్పాటు చేసుకునే సీసీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్ అత్యంత కీలకమైంది. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఫీడ్ మొత్తం అందులోనే నిక్షిప్తమవుతుంది. నేరగాళ్లు దీన్ని కూడా పట్టుకుపోతే దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు చెరిగిపోయినట్లే. చోరీ జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల, సమీపంలో ఇతర సీసీ కెమెరాలు లేకపోతే దాదాపు ఆధారాలు కనుమరుగైనట్లే. అబ్దుల్లాపూర్‌మెట్ వైన్ షాపులో చోరీ విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి సందర్భాల్లో దర్యాప్తు కష్టసాధ్యంగా మారుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసుల విభాగం కొన్ని కీలక సూచనలు చేస్తోంది. ఫోన్లో సేవ్ చేసుకుంటే... ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న సీసీ కెమెరాల్లో అత్యధికం ఐపీ బేస్ట్ పరిజ్ఞానంతో పని చేస్తున్నాయి. యజమానులు తాము ఎక్కడ ఉన్నప్పటికీ తమ ఇంట్లో, దుకాణంలో ఏ జరుగుతోందో చూడటానికి అనువుగా ఇంటర్నెట్ ఆధారంగా పని చేసే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అనునిత్యం వీరి సెల్‌ఫోన్‌తో కనెక్ట్ అయి ఉండే ఈ కెమెరాల ఫీడ్‌ను యజమానులు ఎక్కడున్నా చూడగలుగుతున్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ, సెల్‌ఫోన్స్ లేదా మెమొరీ కార్డ్స్ సామర్థ్యం పెంచుకుంటూ మరికొన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఫోన్లో కనిపించే ఫీడ్ కనీసం 48 గంటల పాటు సేవ్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా చోరీ చేసిన తర్వాత తమ వెంట డీవీఆర్‌ను ఎత్తుకుపోయినా సెల్ఫోన్లో రికార్డు అయి ఉండే ఫీడ్ ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళ్తుంది. ‘పక్కన’ పెడితే ఎంతో మేలు... సెల్ఫోన్లో సేవింగ్ విధానం ఇళ్లల్లో ఉన్న సీసీ కెమెరాలకు సరిపోతుంది. కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫీడ్ భద్రపరచడానికి మెమొరీ కార్డ్ సామర్థ్యం చాలకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘పక్కన ఏర్పాట్లు’ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ పక్కన ఉన్న మరో దుకాణంలో ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకవేళ చోరీ జరిగి దొంగలు ఆ దుకాణంలోని డీవీఆర్ ఎత్తుకుపోయినా ఇబ్బంది ఉండదన్నారు. పక్కపక్క ఇళ్లల్లో చోరీలు తరచూ వెలుగు చూస్తున్నా... దుకాణాల్లో ఈ తరహాలో జరగడం అత్యంత అరుదని, దీంతో ఈ విధానం వల్ల ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఈ కోణంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. -
దృష్టి మళ్లిస్తారు.. దోచేస్తారు
అనంతపురం సెంట్రల్: ప్రజల దృష్టి మళ్లించి బ్యాగులు దొంగిలించే రెండు అంతర్రాష్ట్ర ముఠాలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 32 లక్షలు విలువైన 1.040 కిలోల (కిలో నాలుగు తులాలు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్‌కుమార్ సోమవారం పోలీసుకాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు. అనంతపురం సీసీఎస్ఎస్ పోలీసులతో కలిసి కదిరి పోలీసులు, గుత్తి పోలీసులు వేర్వేరుగా వెళ్లి రెండు దొంగల ముఠాలను పట్టుకున్నారు. కదిరి పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అనంతపురం రూరల్ మండలం పెద్దింటి గొల్ల రమేష్, ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఆవుల రత్నమ్మ, తుంకూరు జిల్లా ఉట్లగేరికి చెందిన బోవి గీత ఉన్నారు. వీరి నుంచి 64 తులాల బంగారు బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. గుత్తి పోలీసులు ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన దేవరకొండ వెంకటేష్, గిర్రాజు కాలనీకి సుబ్బరాయుడు, దర్శి ముత్యాలప్పలను అరెస్ట్ చేసి, వారి నుంచి 38 తులాలను స్వాధీనం చేసుకన్నారు. ఈ రెండు ముఠాల్లోని ఆరుగు సభ్యులు సమీప బంధువులు. వీరిలో దర్శి సుబ్బరాయుడు, దర్శి ముత్యాలప్పలు స్వయాన అన్నదమ్ములు. వీరంతా కలిసి బ్యాగ్ లిఫ్టింగ్.. ద్యాస మళ్ళించి నేరాలకు పాల్పడడం వృత్తిగా ఎంచుకున్నారు. తోటి ప్రయాణికుల్లా బస్సుల్లో ఎక్కడం, ప్రయాణికుల నుంచి పర్సులు, బ్యాగులు ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది. వీరంతా పాత నేరస్తులు. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలో వీరిపై కేసులున్నాయి. 2014లో త్రీటౌన్, తాడిపత్రి రూరల్ పోలీస్‌స్టేషన్ 10 కేసుల్లో వీరిని అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు ఇస్మాయిల్, కదిరి ఎస్ఐ హేమంత్‌కుమార్, గుత్తి ఎస్ఐ యువరాజు, వలీబాషు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. స్టేట్ బ్యాంకు దోపిడీ కేసునుచేధించిన పోలీసులకు ఎస్పీ అభినందన జిల్లాలో సంచలనం కలిగించిన జేఎన్టీయూ స్టేట్‌బ్యాంకు దోపిడీ కేసును రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అభినందించారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీరామ్, లేపాక్షి ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది రాంబాబు, గిరిబాబు, కుళ్లాయప్ప, షాకీర్, శివకుమార్ తదితరులను సత్కరించారు. బ్యాంకర్లు కూడా కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడం వలన నేరాలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం బ్యాంకులు మూసేస్తే మళ్లీ సోమవారం వెళ్లి చూసుకుంటారన్నారు. పర్యవేక్షణ లోపిస్తే దొంగలు నేరాలకు పాల్పడే ఆస్కారం ఎక్కువగా ఉందన్నారు. త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. -
వివిధ ‘పేర్లతో’ ఇళ్ళల్లోకి ఆపై తుపాకీతో..
సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సంచరిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నగరవాసులకు సూచిస్తున్నారు. నలుగురు సభ్యులతో కూడిన ఈ గ్యాంగ్ వివిధ పేర్లతో ఇళ్ళల్లోకి ప్రవేశించి, దోపిడీలకు కుట్రపన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న అధికారులు తమ తమ ఠాణాలకు చెందిన అధికారిక ఫేస్బుక్ పేజ్‌ల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన ఈ నలుగురూ నగరానికి వచ్చి కొన్ని ప్రాంతాల్లోని లాడ్జిలు, అద్దె ఇళ్ళల్లో బస చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌్సగా తయారయ్యే వీరంతా బృందాలుగా బయటకు వస్తాయని చెప్తున్నారు. కాలనీల్లో తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధుల ఇళ్ళను గుర్తిస్తుంటారు. ఇలాంటి ఇళ్ళ వద్దకు వెళ్ళి తమ ఉత్పత్తుల్ని ఉచితంగా డెమో ఇస్తామని, అతి తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఎర వేస్తుంటారు. కొన్ని చోట్ల ఏకంగా ఎకో ఫ్రెండ్లీ, తక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే బల్బుల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నామని, వీటని ఉచితంగా ఇంట్లో ఏర్పాటు చేస్తామని చెప్తుంటారని పోలీసులు వివరిస్తున్నారు. వీరి వల్లోపడిన వారు ఎవరైనా ఇంట్లోకి రానిస్తే... తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలను చూపించి దొపిడీలకు పాల్పడేందుకూ వెనుకాడరని చెప్తున్నారు. ఇలాంటి వారి కదలికలపై సమాచారం ఉన్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు : తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాగుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
చివ్వెంల: నకిలీ విదేశీ కరెన్సీ చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రశీదు నిందితుల వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన వల్దాస్ ఉపేందర్‌ను అదే పట్టణానికి చెందిన రంప శ్రీను, జాన్కూటి మోహన్‌కుమార్ వారం రోజుల క్రితం కలిశారు.తమ వద్ద బ్రెజిల్ రూ.వెయ్యి కరెన్సీ(మిల్క్రూసెడస్ల్)నోట్లు ఉన్నాయని, కావాలంటే చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులో కాఫీ డే హోటల్‌కి వచ్చి తీసుకోమ్మని తెలపండంతో ఉపేందర్‌కు అక్కడకు వెళ్లాడు. వీటి విలువ భారత దేశంలో ఒక్కనోట్కు రూ.24 వేలు వస్తాయని నమ్మబలికి ఆతని వద్ద నుంచి రూ.40వేలు ఇండియా కరెన్సీ తీసుకుని రూ.40బ్రెజిల్ నోట్లు ఇచ్చారు. ఈక్రమంలో ఉపేందర్ హైదరాబాద్‌లోని కరెన్సీ ఎక్స్ఛేంజ్ కార్యాలయానికి వెళ్లాడు. నోట్లను మార్చుకునే క్రమంలో అధికారులు ఈనోట్లు 2003 సంవత్సరంలోనే ఆదేశంలో రద్దు చేశారని తెలపడంతో చేసేది లేక ఇంటికి వచ్చి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశాడు, కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ కె.నర్సింహారావు డీఎస్పీ ఆదేశాలతో సూర్యాపేట పట్టణానికి చెందిన శ్రీను, మోహన్‌కుమార్‌ను ఆదుపులోకి తీసుకొని విచారించగా పెద్ద రాకెట్ బయట పడింది. వీరికి నకిటి నోట్లు ఇచ్చేవారు ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట పట్టణంలోని ఎంఎస్ఆర్ హోటల్‌కు వస్తారని తెలపడంతో రూరల్ సీఐ వి.నర్సింహారెడ్డి, ఎస్ఐ కె.నర్సింహారావు అక్కడకు వెళ్లి మాటు వేసి నకిలీ కరెన్సీ ముఠాను ఆదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులు విజయవాడ, గుంటూరుకు చెందిన షేకవజీర్ అహ్మద్, హతిరాజ్ గురువయ్య, కలపల అజయ్‌కుమార్,కన్న మహేష్, మన్నవ బసంత్ బాబులుగా గుర్తించి వారి వద్ద నుంచి 596 బ్రెజిల్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ భారత కరెన్సీలో రూ.కోటి 43 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలపారు. వీరిని విచారించగా తమకు చెన్నైకు చెందిన రమణ అనే వ్యక్తి నుంచి వస్తాయని వాటిని వివిధ ప్రాంతాలో తమ ఎజెంట్ల ద్వారా చెలామణి చేస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్బంగా రూరల్‌సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ కె,నర్సింహరావు, ఐడీపార్టీ సిబ్బందిఎం.అంజయ్య, శ్రీనివాస్‌నాయుడు, రామనర్సయ్య, జాఫర్ ఆలీ, శివలను డీఎస్పీ అభినందించారు. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
సత్తుపల్లి: నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సత్తుపల్లి పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి డీఎస్పీ బి.అశోక్‌కుమార్ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన కిషోర్ రాథోడ్ అలియాస్ బూరు, రాధా రాథోడ్ అలియాస్ శాంతి కలిసి సత్తుపల్లి పట్టణంలో ఇద్దరు వ్యాపారులను బంగారం పేరుతో మోసగించేందుకు ప్రయత్నించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ముఠా ఇలా మోసాలకు పాల్పడుతోంది. ఇలా మోసగిస్తారు... ‘‘మా వద్దనున్న బంగారపు పూసల దండ ఖరీదు కనీసం 20 నుంచి 25 లక్షల రూపాయలు ఉంటుంది. కేవలం నాలుగైదు లక్షలకే ఇచ్చేస్తాం’’ అని చెప్పి పూసల దండలో నుంచి ఒక పూస తెంపినట్టుగా నటించి ‘ఒరిజినల్ బంగారపు పూస ఇచ్చి నమ్మిస్తారు. ఆ తరువాత దానిని అంటగడతారు. వాస్తవానికి ఆ పూసల దండ ఇత్తడితో చేయించినది. దానిని నాగపూర్‌లో ఐదువేల రూపాలకు కొని తెస్తారు. పట్టణంలోని ఇద్దరు వ్యాపారులను ఇలా మోసగించేందుకు ప్రయత్నించారు. వీరిని ఆ వ్యాపారులు అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చారు. వీరిని సత్తుపల్లి పట్టణ సీఐ యు.వెంకన్నబాబు నేతృత్వంలో ఎస్సై నాగరాజు, కానిస్టేబుళ్లు చక్రధర్‌రాజు, ప్రకాష్, ఉమర్, బి.వెంకటేశ్వరరావు బృందంగా ఏర్పడి నిఘా వేసి పట్టుకున్నారు. నిందితులు కిషోర్ రాథోడ్, రాధా రాథోడ్ మహారాష్ట్ర నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు. వీరు ప్లాస్టిక్ పూల దండలు, బొకేలతో వీధివీధినా తిరుగుతుంటారని, అమాయకులను చాకచక్యంగా బురిడి కొట్టిస్తారని చెప్పారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పట్టణ సీఐ యు.వెంకన్నబాబు, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగల నుంచి కోటిన్నర విలువైన కార్లు స్వాధీనం
అనంతపురంలో ఈ రోజు ఉదయం అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు నగర డీఎస్పీ దయానందరెడ్డి ఆదివారం వెల్లడించారు. వారి వద్ద నుంచి కోటిన్నర విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ముఠాకు చెందిన మరో ఏడుగురు సభ్యులు తప్పించుకున్నారని చెప్పారు. దొంగలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే గుంటూరు జిల్లాలోని తెనాలిలో మరో అంతరాష్ట్ర దోపిడికి చెందిన ఇద్దరు దొంగలను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
అంతరాష్ట్ర ముఠా అరెస్టు
సాక్షి,సిటీబ్యూరో: మనదేశంలో నిషేధంలో ఉన్న బ్రెజిల్ కరెన్సీని గుట్టుచప్పుడు కాకుండా మార్పిడి చేయడమే కాకుండా ఒక బ్రెజిల్ నోటుకు సరిపడా రూపాయలు ఇస్తే.. మరో బ్రెజిల్ నోటును ఉచితంగా ఇస్తామని అమాయకులను మోసగిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి బ్రెజిల్ దేశపు కరెన్సీ రియాల్స్ 1,62,450ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి పరారీలో ఉండగా నలుగురు సభ్యులు పట్టుబడ్డారు. ఎస్వోటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్దన్‌రెడ్డి శుక్రవారం దీనికి సంబంధించి వివరాలను మీడియాకు వెల్లడించారు. కేరళకు చెందిన కరీం (40), ప్రేమచంద్ర (35),హనీఫ్ (30)లు స్నేహితులు. ప్రేమచంద్ర స్నేహితుడు పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన సివిల్ ఇంజనీర్ బాలాజీరెడ్డి (52), ఇతని స్నేహితుడైన కాకినాడకు చెందిన కంప్యూటర్లు విక్రయించే చంపాటి కృష్ణంరాజు (24)లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి కరీం. మనదేశంలో నిషేధితమైన బ్రెజిల్ కరెన్సీని ఇక్కడ మార్పిడి చేసేందుకు ఈఐదుగురు పథకం వేశారు. బ్రెజిల్‌కు చెందిన ఒక నోటు (రియాల్స్)కు విలువచేసే (మారక ధర) ఇండియన్ రూపాయినోట్లు ఇస్తే మరో బ్రెజిల్ నోటు ఉచితంగా ఇస్తామని పలువురు అమాయకులను వలలో వేసుకున్నారు. అత్యాశకు పోయిన కొందరు వీరినుంచి బ్రెజిల్ నోట్లను తీసుకున్నారు. ఇలా ఈ ముఠా బ్రెజిల్ నోట్లను మార్పిడి చేసేందుకు సరూర్‌నగర్‌లోని శాంత రెసిడెన్సీ హోటల్‌కు చేరుకుంది. విశ్వసనీయ సమాచారమందుకున్న సైబరాబాద్ పోలీ సు కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్వోటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు కుశాల్కర్, కె.చంద్రశేఖర్‌లు హోటల్‌పై దాడిచేసి ప్రేమచంద్ర, హనీఫ్, బాలాజీ రెడ్డి, కృష్ణంరాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి బ్రెజిల్ కరెన్సీని స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను సరూర్‌నగర్ పోలీ సులకు అప్పగించారు. ప్రధానసూత్రధారి కరీం పట్టుబడితే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని గోవర్దన్‌రెడ్డి చెప్పారు.