నేరాలే వీరి వృత్తి | Interstate Gangs in Karnataka | Sakshi
Sakshi News home page

పోలీసులకు సవాల్‌గా మారిన నేరగాళ్లు

Published Wed, Feb 13 2019 12:44 PM | Last Updated on Wed, Feb 13 2019 12:44 PM

Interstate Gangs in Karnataka - Sakshi

కర్ణాటక , బనశంకరి : ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన బెంగళూరు నగరం నేడు నేరాల నగరిగా మారిపోయింది. అంతరాష్ట్ర గ్యాంగుల నేర కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పోలీసులకు వారిని పట్టుకోవడం ఒక సవాల్‌గా మారింది. గత ఏడాది అంతరాష్ట్ర గ్యాంగ్స్‌పై వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయంటే నేరాలు ఏ విధంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు కమిషనరేట్‌ పరిధిలోని 8 డీసీపీ విభాగాల్లో అంతరాష్ట్ర గ్యాంగ్‌లు చోరీలు,   దోపిడీలకు తెగబడ్డారు. స్థానిక గ్యాంగ్‌లు ఒక ప్రాంతంలో మాత్రమే నేర కార్యకలాపాలకు పాల్పడతారు. వీరి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సులభం. కానీ బయటి రాష్ట్రాలనుంచి గ్యాంగ్స్‌ నియంత్రణ కష్టసాధ్యమని క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు చెబుతున్నారు.

బుడకట్టు, బవారియా.. : ఈ సముదాయానికి చెందిన వారు నగర జీవనానికి అలవాటుపడి నేరాలే వీరి వృత్తి. వీరికి మరో ఉపాధి తెలియదు. మరొకటి బవేరియా గ్యాంగ్, ఉత్తర భారతానికి చెందిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలిచే బవేరియా గ్యాంగ్‌ దేశవ్యాప్తంగా పోలీసులకు సవాల్‌ మారారు. బవేరియా గ్యాంగ్‌ ఒక నగరంలో దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన అనంతరం మూడు నాలుగు నెలల వరకు ఆ ప్రాంతం వైపు వెళ్లరు. వేరే రాష్ట్రాలకు వెళ్లి ఇతర నగరాల్లో తమ తడాఖా చూపిస్తారు. బెంగళూరులో ఒక గ్యాంగ్‌ పట్టుబడితే ఆ గ్యాంగ్‌  మళ్లీ ఇక్కడకు రారు. మరో కొత్త గ్యాంగ్‌ ఇక్కడికి వస్తుంది. దీంతో బవారియా గ్యాంగ్‌లు ట్రాక్‌ రికార్డ్‌ నిర్వహించడం కష్టతరంగా మారిందని నేరవిభాగం పోలీసులు చెబుతున్నారు.  

చోరీ సొత్తును ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తారు. బవేరియా, ఇరానీ, ఓజికుప్పం, రామ్‌జీనగర, బిట్రగుంట గ్యాంగ్‌లు చోరీకి పాల్పడిన సొత్తును తమ నాయకుడికి అప్పగిస్తారు. అతనే చోరీ సొత్తు విక్రయించే బాధ్యత తీసుకుంటాడు. చోరీల్లో పాల్గొనే కుటుంబాల నిర్వహణకు సాయపడటం, పోలీసులకు పట్టుబడిన గ్యాంగ్‌ సభ్యులను పోలీస్, కోర్టులనుంచి జామీనుపై విడిపించే పనిచేస్తారు. ఆ గ్యాంగ్‌లకు లీడర్‌  ఒక్కరే ఉండరు  అప్పుడప్పుడు మారుతుంటారు. బెంగళూరు పోలీసులకు ఈ గ్యాంగ్స్‌ సొంత ఊర్లలోకి వెళ్లి గాలించడం అసాధ్యం. వీరికి తోడు నేపాలీ గ్యాంగ్‌ కూడా పోలీసులకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఉపాధి నిమిత్తం వచ్చి చోరీలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement