నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వర్మ, ఇన్‌స్పెక్టర్లు సురేష్ రెడ్డి, మహేంద్ర, సత్యానందం
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేస్తున్న పది మందితో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట పోలీస్‌లు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.90 లక్షల ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు, రూ.60 వేల నగదు, ఒక కారు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫన్‌టైం రోడ్డులోని విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వర్మ ఈ కేసు వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు.
ఆయన కథనం మేరకు..ఈ నెల 19న పటమట పోలీస్ పరిధిలోని మారిస్ స్టెల్లా కాలేజీ సమీపంలోని యాక్సిస్ బ్యాంకులో ఎనిమిది రూ.500 నకిలీ ప్లాస్టిక్ కట్టలను అంతర్రాష్ట్ర ముఠా ఏటీఎం డిపాజిట్ మిషన్‌లో వేసింది. నకిలీ నోట్లు అన్ని మిషన్‌లోకి రావడాన్ని గమనించిన బ్యాంకు అధికారులు పటమట పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులను పట్టుకునేందుకు విజయవాడ సీపీ రాణా 3 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న విజయవాడ భారతీనగర్‌కు చెందిన తాతపూడి రాజు, జి.కొండూరు మండలం వెలగలేరుకి చెందిన రమేష్‌బాబు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన ఆంజనేయులు, సుజాత, సాయిమణికంట, రాజు, బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన అబ్రహం, పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన హనుమంతరావు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మధుమంచి ప్రసాద్, చిలుకూరి మరియదాస్‌ను బుధవారం పటమట పోలీస్ స్టేషన్ పరిధి భారతీనగర్‌లో టాస్క్‌ఫోర్స్, పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను అసలు నోట్లుగా మార్చి, తక్కువ నగదుకు ఎక్కువ నగదు పొంది వాటితో జల్సాలు చేద్దామనే ఉద్దేశంతో నిందితులు ఈ వ్యవహారానికి పాల్పడ్డారు. వీరిలో ఆంజనేయులు, రమేష్‌బాబు, అబ్రహం, రాజు నకిలీ నోట్ల చలామణీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment