సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది మార్చ్‌లో... పేట్లబురుజులో ఉన్న బంగారు నగల కార్ఖానాలో మూడు కేజీలకు పైగా పసిడి దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ఎత్తుకుపోయింది. జూలైలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నవదుర్గ వైన్స్‌లో షెట్టర్ పగులకొట్టిన చోరులు రూ.8,600 నగదు, కొన్ని మద్యం బాటిళ్లతో పాటు డీవీఆర్ కూడా పట్టుకుపోయారు. తాజాగా ఈ నెల 11న అబిడ్స్ ఠాణా పరిధిలోని ఫతేసుల్తాన్‌లేన్‌కు చెందిన సునీల్ అగర్వాల్ ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయిన నేపాల్ గ్యాంగ్ సైతం తమ వెంట డీవీఆర్ తీసుకువెళ్లింది. సైబర్ క్రిమినల్స్ మాత్రమే కాదు... సొత్తు సంబంధ నేరాలు చేసే నేరగాళ్లు సైతం నానాటికీ తెలివి మీరుతున్నారు. నేరాని సంబంధించి ఎలాంటి ఆధారాలు మిగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వెలుగులోకి వస్తున్న కొత్త ట్రెండ్ డీవీఆర్‌లు ఎత్తుకెళ్లడం. ఇటీవల కాలంలో అనేక ఉదంతాల్లో ఈ ధోరణి కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. అంతరాష్ట్ర ముఠాల నుంచి చిల్లర నేరగాళ్ల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తున్నారు. ప్రజలు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కేటుగాళ్లకు చెక్ చెప్పవచ్చని సూచిస్తున్నారు.
సమయానుకూలంగా ‘స్మార్ట్’గా...
ఏదైనా నేరం జరిగినప్పుడు దర్యాప్తులో భాగంగా చిన్న క్లూ అయినా సంపాదించాలని పోలీసులు ఎలా ఆలోచిస్తారో... ఏ చిన్న ఆధారం వదలకూడదని నేరగాళ్లూ ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు తమ వేలి, కాలి ముద్రలు దొరక్కుండా జాగ్రత్తపడేవారు. అప్పట్లో పోలీసుల దర్యాప్తునకు ఇవే కీలకం కావడంతో చేతికి గ్లౌజులు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని ‘రంగం’లోకి దిగేవారు. ఆ తర్వాతి రోజుల్లో పోలీసు జాగిలాలకు తమ జాడ చిక్కకుండా ఘటనాస్థలాల్లో కారం చల్లడం వంటి ఉదంతాలు వెలుగు చూశాయి. కొన్నేళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని ఆర్‌ఏకే లాడ్జిలో జరిగిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం హత్య కేసు సహా మరెన్నో నేరస్థలాల్లో ఈ ధోరణి కనిపించింది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు తీరు మారింది. అనేక కేసుల్లో సీసీ కెమెరాలే కీలక ఆధారాలు ఇస్తున్నాయి. దీంతో దొంగలు తొలినాళ్లల్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్క్‌లు, ముసుగులు వేసుకునే వారు. ఆపై వాటిని ధ్వంసం చేయడం చేశారు. ఈ ‘కాలక్రమంలో’ భాగంగా ఇటీవల కాలంలో కనిపిస్తున్న ట్రెండ్ డీవీఆర్‌ల చోరీ.
అది ఎత్తుకుపోతే అంతే...
ప్రస్తుతం దుకాణదారులతో పాటు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పబ్లిక్ ప్లేసుల్లో పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి రాలేదు. ప్రజలు, వ్యాపారులు ఏర్పాటు చేసుకునే సీసీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్ అత్యంత కీలకమైంది. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఫీడ్ మొత్తం అందులోనే నిక్షిప్తమవుతుంది. నేరగాళ్లు దీన్ని కూడా పట్టుకుపోతే దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు చెరిగిపోయినట్లే. చోరీ జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల, సమీపంలో ఇతర సీసీ కెమెరాలు లేకపోతే దాదాపు ఆధారాలు కనుమరుగైనట్లే. అబ్దుల్లాపూర్‌మెట్ వైన్ షాపులో చోరీ విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి సందర్భాల్లో దర్యాప్తు కష్టసాధ్యంగా మారుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసుల విభాగం కొన్ని కీలక సూచనలు చేస్తోంది.
ఫోన్‌లో సేవ్ చేసుకుంటే...
ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న సీసీ కెమెరాల్లో అత్యధికం ఐపీ బేస్ట్ పరిజ్ఞానంతో పని చేస్తున్నాయి. యజమానులు తాము ఎక్కడ ఉన్నప్పటికీ తమ ఇంట్లో, దుకాణంలో ఏ జరుగుతోందో చూడటానికి అనువుగా ఇంటర్‌నెట్ ఆధారంగా పని చేసే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అనునిత్యం వీరి సెల్‌ఫోన్‌తో కనెక్ట్ అయి ఉండే ఈ కెమెరాల ఫీడ్‌ను యజమానులు ఎక్కడున్నా చూడగలుగుతున్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ, సెల్‌ఫోన్స్ లేదా మెమొరీ కార్డ్స్ సామర్థ్యం పెంచుకుంటూ మరికొన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఫోన్‌లో కనిపించే ఫీడ్ కనీసం 48 గంటల పాటు సేవ్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా చోరీ చేసిన తర్వాత తమ వెంట డీవీఆర్‌ను ఎత్తుకుపోయినా సెల్‌ఫోన్‌లో రికార్డు అయి ఉండే ఫీడ్ ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళ్తుంది.
‘పక్కన’ పెడితే ఎంతో మేలు...
సెల్‌ఫోన్‌లో సేవింగ్ విధానం ఇళ్లల్లో ఉన్న సీసీ కెమెరాలకు సరిపోతుంది. కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫీడ్ భద్రపరచడానికి మెమొరీ కార్డ్ సామర్థ్యం చాలకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘పక్కన ఏర్పాట్లు’ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ పక్కన ఉన్న మరో దుకాణంలో ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకవేళ చోరీ జరిగి దొంగలు ఆ దుకాణంలోని డీవీఆర్ ఎత్తుకుపోయినా ఇబ్బంది ఉండదన్నారు. పక్కపక్క ఇళ్లల్లో చోరీలు తరచూ వెలుగు చూస్తున్నా... దుకాణాల్లో ఈ తరహాలో జరగడం అత్యంత అరుదని, దీంతో ఈ విధానం వల్ల ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఈ కోణంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment