వాహనాలు, నిందితులు
నాగోలు: పైప్‌లైన్ల నుంచి డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న 12 మంది అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు సభ్యులను మల్కాజ్‌గిరి సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.90.40లక్షల నగదు, డీజిల్ ట్యాంకర్, స్కార్పియో, బైక్, డీజిల్ దొంగతనానికి ఉపయోగించే పైప్‌లు, మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియంకు చెందిన డీజిల్ అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా చర్లపల్లి నుంచి ఘట్కేసర్ వరకు 17 కిలోమీటర్ల మేర సరఫరా జరుగుతుంది. దీనిని గుర్తించిన మహరాష్ట్రకు చెందిన పాతనేరస్తుడు హఫీజ్ అజిస్ చౌదరి అలియాస్ హఫీజ్, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్ యజమాని జియోలాల్ చంద్ షేక్ అలియాస్ చెడ్డ అలియాస్ చెడ్డీ, మహబూబ్ నగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన బిన్ని శ్రీనివాసులు ముఠాగా ఏర్పడ్డారు. బర్కత్‌పురకు చెందిన మహిళను వివాహం చేసుకున్న హఫీజ్ తరచూ నగరానికి రాకపోకలు సాగించేవాడు. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం సరఫరా జరిగే పైప్‌లైన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన అతను చర్లపల్లి– ఘట్కేసర్ మధ్యలో మహేందర్‌గౌడ్‌కు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించాడు. డీజిల్ సరఫరా అవుతున్న పైప్‌లైన్‌కు రంధ్రం చేసి మోటర్ల ద్వారా తోడి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవాడు.
1.30లక్షల లీటర్ల డీజిల్ చోరీ...
భారత్ పెట్రోలియం నుంచి 84,365 లీటర్లు, ఇండియన్ ఆయిల్ నుంచి 46,232 లీటర్ల చొప్పున మొత్తం 1.30లక్షల కిలోల డీజిల్‌ను 7 ట్యాంకర్ల ద్వారా అమ్మకా>లు కొనసాగించారు. ఈ క్రమంలో నగరానికి చెందిన మొహాద్ అబ్దుల్ అబ్రార్‌తో పాటు ముంబైకి చెందిన ట్యాంకర్ డ్రైవర్లు సునీల్ అనిల్ మదేవార్, వాసు, సూర్యపేట జిల్లా, కొత్తెగూడం కుచెందిన జయకృష్ణ, శ్రీకాంత్ నరేష్‌రెడ్డి, రాంబల్లి యాదవ్, సురేష్ కుమార్ ప్రజాపతి, సర్జూ అలియాస్ అహ్మద్ ఖాన్ ద్వారా డీజిల్‌ను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేశారు. హఫీజ్ 2013లో నాంపల్లి పీఎస్ పరిధిలో దొంగనోట్ల కేసులో అరెస్టై జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. 2015లో ముంబైలో ఇదే కేసులో జైలు కెళ్లాడు. మొహద్ అబ్దుల్ అబ్రార్ పై ముంబైలో నకిలీ కరెన్సీ కేసు ఉండగా, జియోలాల్ చంద్ షేక్‌పై ముంబైలో డీజిల్ దొంగతనం కేసులు, రాబరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. డీజిల్ సరఫరా సమయంలో తరుచూ డీజిల్ తక్కువగా వస్తున్నట్లు గుర్తించిన భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం అధికారులు కీసర, మల్కాజ్‌గిరి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులు హఫీజ్ అజిస్ చౌదరి, బిన్ని శ్రీనివాస్‌లు, మొహాద్ అబ్దుల్ అబ్రార్ , మారోజు జయకృష్ణను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది కోసం స్పెషల్ పార్టీ పోలీసులు గాలిస్తున్నట్లు సీపీ తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన మల్కాజ్‌గిరి, కీసర పోలీసులకు రివార్డు అందజేశారు. సమావేశంలో రాచకొండ క్రైం డీసీపీ కేఆర్.నాగరాజు, మల్కాజ్‌గిరి డీసీపీ. ఉమామహేశ్వరశర్మ అడిషనల్ డీసీపీ సలీమా, సీసీఎస్ సీఐ లింగయ్య, జగన్నాథరెడ్డి, రుద్రభాస్కర్, ప్రకాష్, వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, కృష్ణారావు, మల్లారెడ్డి, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
చోరీ కోసం సొరంగం...
నిందింతులు డీజిల్ దొంగలించేందుకు ఏకంగా రెండు అడుగుల లోతున సొరంగాన్ని తవ్వి డీజిల్ సరఫరా అయ్యే పైపులైన్‌కు రంద్రం పెట్టి మోటార్ ద్వారా డీజిల్‌ను ట్యాంకర్లకు నింపేవారని పోలీసులు తెలిపారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. సంబంధిత అధికారులు డీజిల్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment