నేరస్తులపై నిఘా | Hyderabad Police Target Interstate Thieves Gang | Sakshi
Sakshi News home page

నేరస్తులపై నిఘా

Published Mon, Jan 13 2020 8:08 AM | Last Updated on Mon, Jan 13 2020 8:08 AM

Hyderabad Police Target Interstate Thieves Gang - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బిహార్‌కు చెందిన అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్స్, చంబన్‌ ముఠా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బవరియా ముఠా.. మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన పార్ధీ గ్యాంగ్స్‌.. నగరంపై పంజా విసురుతున్న ఇలాంటి వలస నేరస్తులకు చెక్‌ పెట్టేందుకు నగర పోలీసులు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘క్రైమ్‌ అలర్ట్‌ సిస్టం’ (సీఏఎస్‌) పేరుతో వ్యూహాత్మక విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో ప్రతిపాదన దశలోనే ఆగిపోయిన ఈ విధానాన్ని ‘విజన్‌ 2020’లో కీలక ప్రాధాన్యం ఇచ్చి అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాకు చెందిన ముఠాలు కొన్నేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వరుసపెట్టి పంజా విసిరాయి. దాదాపు నాలుగు రాష్ట్రాల పోలీసులకు ఈ గ్యాంగ్స్‌ ముచ్చెమటలు పట్టించాయి. అప్పట్లో వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఎవరి చర్యలు వారు తీసుకున్నా ఫలితం అంతంత మాత్రమే. దీంతో అంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌ (ఉమ్మడి)కు వచ్చారు. ఆ ముఠాలు నివసించే ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులనే ఆశ్రయించారు. వారి సహకారంతోనే ఈ ముఠాలను కట్టడి చేయగలిగారు. నిత్యం నగరంలో పంజా విసురుతున్న అటెన్షన్‌ డైవర్షన్‌ ముఠాలు, సూడో పోలీస్‌ గ్యాంగ్స్, చైన్‌ స్నాచర్లు, దోపిడీ, చోరీ ముఠాలకు చెక్‌ చెప్పేందుకూ ఇలాంటి విధానాన్నే అమలు చేయాలని సిటీ కాప్స్‌ నిర్ణయించారు. దీనికి క్రైమ్‌ అలర్ట్‌ సిస్టం (సీఏఎస్‌) అని పేరు పెట్టారు. జ్యువెలరీ దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలను టార్గెట్‌గా చేసుకుని జనాల పుట్టి ముంచే ఈ ముఠాలన్నీ బయటి ప్రాంతాల నుంచి వచ్చేవే. అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్స్‌లో చెన్నై సమీపంలో ఉన్న రామ్‌జీనగర్, తిరుచ్చితో పాటు మహారాష్ట్రలోని పుణె, భివండి నుంచి వచ్చే ముఠాలు కొన్ని ఉన్నాయి. చిత్తూరు జిల్లా నగరి ముఠాలు కొన్ని నగరంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి.

ఇక, సూడో పోలీసుల విషయానికి వస్తే బెంగళూరు పరిసరాలకు చెందిన ఇరానీ గ్యాంగ్, బీదర్, గుంతకల్‌ నుంచి వచ్చి తమ ‘పని’ చక్కపెట్టుకు పోయేవాళ్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ సహా అనేక ప్రాంతాల నుంచి వచ్చి గొలుసులు లాక్కుపోతున్న చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్‌ సైతం ఉంటున్నాయి. పోలీసు రికార్డుల్లోకి ఎక్కకుండా పని చక్కపెట్టుకుపోతున్న ముఠాలు, నేరగాళ్లు ఇంకా ఎందరో ఉన్నారనేది పోలీసులే అంగీకరిస్తున్నారు. వీరంతా నగరంలోని లాడ్జిలు, శివారు ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో డెన్స్‌ ఏర్పాటు చేసుకుని టిప్‌టాప్‌గా తయారై విద్యార్థులు, ఉద్యోగులు మాదిరిగా సంచరిస్తారు. అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్స్‌కు చెందిన ఐదారుగురు గ్యాంగ్‌గా బయటకు వచ్చి బ్యాంకులు, జ్యువెలరీ దుకాణాలు, వ్యాపార కేంద్రాల వద్ద రెక్కీ నిర్వహించి, కాపు కాసి పంజా విసురుతారు. చైన్‌ స్నాచర్‌లైతే వస్త్ర వ్యాపారుల ముసుగులో షెల్టర్లు తీసుకుంటూ రెండు బృందాలుగా బయటకు వచ్చి పక్కా పథకం ప్రకారం రెచ్చిపోతున్నారు. అయితే, నగరంలో ఎల్లప్పుడూ వీరిపై నిఘా వేసి ఉంచడం సాధ్యం కావట్లేదు. ఒకసారి నగరంలోకి ప్రవేశించిన గ్యాంగ్‌ వరుసపెట్టి నేరాలు చేసి వెళ్తుంది. ఈ ముఠాలను పట్టుకోవడం, రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రయత్నిస్తే పోలీసులకూ ఒక్కోసారి చావుదెబ్బలు తప్పట్లేదు. ఈ ఇబ్బందులను అధిగమించడం కోసం సీఏఎస్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

‘‘క్రిమినల్‌ అలర్ట్‌ సిస్టం
(సీఏఎస్‌)లో నగర పోలీసులకు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో వారిసహకారం తీసుకుంటారు. ఆయా రాష్ట్రాలు, నేరగాళ్లు నివసించే ప్రాంతాలకు చెందిన అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతుంటారు. అనివార్య కారణాల నేపథ్యంలో వారి ప్రాంతంలో ఉంటున్న కరుడుగట్టిన, వ్యవస్థీకృత ముఠాలను అరెస్టు చేయడానికి అవకాశం లేని నేపథ్యంలో ఆయా అధికారులను వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా కోరతారు. అక్కడ నుంచి ఈ గ్యాంగ్స్‌ బయలుదేరిన వెంటనే వారికదలికలను పసిగట్టినగర పోలీసులను అప్రమత్తం(అలర్ట్‌) చేసేలా నెట్‌వర్క్‌ ఏర్పటు చేసుకుంటారు. తద్వారా నగర వాసులతో పాటు జ్యువెలరీ దుకాణాలు, బ్యాంకుల వారిని అప్రమత్తం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి నేరాలునిరోధించడం, అవకాశం దొరికితే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు.’’  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement