సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సంచరిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నగరవాసులకు సూచిస్తున్నారు. నలుగురు సభ్యులతో కూడిన ఈ గ్యాంగ్ వివిధ పేర్లతో ఇళ్ళల్లోకి ప్రవేశించి, దోపిడీలకు కుట్రపన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న అధికారులు తమ తమ ఠాణాలకు చెందిన అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌ల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన ఈ నలుగురూ నగరానికి వచ్చి కొన్ని ప్రాంతాల్లోని లాడ్జిలు, అద్దె ఇళ్ళల్లో బస చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రతి రోజూ ఉదయం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌్సగా తయారయ్యే వీరంతా బృందాలుగా బయటకు వస్తాయని చెప్తున్నారు. కాలనీల్లో తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధుల ఇళ్ళను గుర్తిస్తుంటారు. ఇలాంటి ఇళ్ళ వద్దకు వెళ్ళి తమ ఉత్పత్తుల్ని ఉచితంగా డెమో ఇస్తామని, అతి తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఎర వేస్తుంటారు. కొన్ని చోట్ల ఏకంగా ఎకో ఫ్రెండ్లీ, తక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే బల్బుల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నామని, వీటని ఉచితంగా ఇంట్లో ఏర్పాటు చేస్తామని చెప్తుంటారని పోలీసులు వివరిస్తున్నారు.
వీరి వల్లోపడిన వారు ఎవరైనా ఇంట్లోకి రానిస్తే... తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలను చూపించి దొపిడీలకు పాల్పడేందుకూ వెనుకాడరని చెప్తున్నారు. ఇలాంటి వారి కదలికలపై సమాచారం ఉన్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.