గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9, 14న ఎన్నికలు, 18న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా 182 మంది సభ్యులు వున్న గుజరాత్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 23తో ముగియనుంది. మొత్తం 50,128 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏకే జోతి వెల్లడించారు. అలాగే తొలిసారిగా గుజరాత్ వ్యాప్తంగా ఓటరు ధ్రువీకరణ పత్రాలున్న ఓటింగ్ యంత్రాలతోపాటుగా నియోజకవర్గానికి కనీసం ఒక్కటైనా పూర్తి మహిళా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీ కసరత్తు చేస్తోంది. అయితే గుజరాత్ కంటే ముందుగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను ఈసీ విడుదల చేయటాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో తప్పుబట్టిన విషయం తెలిసిందే. మరోవైపు ఈసీ ప్రకటనతో గుజరాత్‌లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.