‘ఆర్టీసీకి చట్ట ప్రకారం చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల బకాయిల్లో కనీసం రూ.47 కోట్లయినా ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉందో లేదో వెంటనే తెలపాలి. సమస్యను యూనియన్, ఇతర అంశాల కోణంలో చూడొద్దు. సామాన్య ప్రజల రవాణా ఇబ్బందుల కోణంలోనే చూడాలి. నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ 40 శాతమే బస్సులు నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ఓ గిరిజన వ్యక్తి తన బిడ్డకు జబ్బు చేస్తే చేతుల్లో పెట్టుకుని వరంగల్ ఆస్పత్రికి తీసుకెళ్లగలడా. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు డెంగీతో బాధపడే రోగిని అంబులెన్స్, ప్రైవేటు వాహనాల్లో తీసుకురాలేని వాళ్లు తన బిడ్డల ప్రాణాలపై ఆశలు వదులుకోవాలా? అలాంటి వాళ్లను చచ్చిపోనిస్తుందా ప్రభుత్వం? ప్రభుత్వం తక్షణమే రూ.47 కోట్లు ఇస్తే.. బిడ్డల ప్రాణాలు నిలుస్తాయి కదా.. ప్రభుత్వం ఆర్థికంగా ఆర్టీసీని ఎలా ఆదుకుని నాలుగు డిమాండ్ల పరిష్కారానికి ఏ నిర్ణయం తీసుకుంటుందో మంగళవారం చెప్పాలి’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, అలాగే కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధి గల ఉన్నతాధికారి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్, ఇతరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాల్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం 2 గంటల పాటు విచారించింది.