ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునరుద్ధరణ పనులు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్‌లో కూడా తగినన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్రాష్టక మహాకుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు నిర్వహిస్తామని, ఈ యాగానికి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు.