సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ ధర్నా చౌక్ వద్ద ప్రజాస్వామ్య వాదులు, మైనార్టీలు ఆందోళన చేపట్టారు. మైనార్టీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ పతకాలు చేబూని వేలాది మంది పౌరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హిందూ-ముస్లిం భాయీ-భాయీ, చౌకీదార్ చోర్’ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకారులు కదం తొక్కారు. భారీగా సంఖ్యలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైకి చేరుకుని సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఇందిరాపార్కు, ఎల్బీ స్టేడియం, మెహదీపట్నం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల ఆందోళనకారులన పోలీసులు చెదరగొట్టారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆందోళన కార్యక్రమంలో ఇంత భారీ స్థాయిలో ప్రజలు పాల్గొనడం ఇదే మొదటిసారి అని నగరవాసులు అంటున్నారు. ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు.