కలిసి చనిపోదామని ఓ యువజంట చేసిన ప్రయత్నంలో ఒకరు విషాదాంతమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గండికోటలో గురువారం ఈ సంఘటన జరిగింది. వివరాలివి. కడప నగరంలోని పెద్దదర్గా సమీపంలో ఉంటున్న మేడిశెట్టి నరసింహప్రసాద్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. రెండో కుమార్తె పేరు భార్గవి. బీఎస్సీ చదివింది. ఎమ్మెస్సీ చదవాలనే ప్రయత్నంలో ఉంది. నరసింహప్రసాద్‌కు కంటి చూపు సమస్య ఉంది. దీంతో అతని భార్య పద్మావతి హోటల్‌లో పనిచేస్తోంది. ఇద్దరు కుమార్తెలను తల్లి కష్టపడి చదివిస్తోంది. భార్గవి కొద్దినెలలుగా చిన్నచౌక్ బుడ్డాయపల్లెకు చెందిన భోగ శ్రీనివాసులు అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతడు డిగ్రీ పూర్తి చేశాడు. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా మహానందికి వెళ్లి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు తమ పెళ్లి విషయాన్ని ఫోన్‌లో తెలియజేసినట్లు సమాచారం.